ఎలుగెత్త నోడి ము న్నెందేని డాగిన
వేదనాదంబులు విస్తరిల్ల
వాయెత్త నోడి పర్వతములు సొచ్చిన
కిన్నర గంధర్వ గీతు లెసగ
దలలెత్త నోడి భూతలమునం దడగిన
నిధు లడుగడుగున నెఱయ దెఱవ
మొగమెత్త నోడి దిఙ్మూఢంబులై యున్న
యాశాననాబ్జంబు లలరి పొలయ
బలిమి మిను ముట్టి వెలిగెడి తారక
ప్రభ యడంగ, బొందు వాసి నవయు
దివిజచక్ర మెల్ల గవ గూడి చన, నిన
పదవితో గుమారు డుదయమయ్యె.
తేజోవంతమైన శివుని వీర్యాన్ని మోస్తున్న అగ్నిదేవునితో సంగమించటం వల్ల, మునిపత్నులు (అరుంధతి తప్ప) గర్భం దాల్చారు. మునులశాపానికి భయపడి, బ్రహ్మదేవుని ఆదేశంతో, ఆ గర్భపిండాలను ఒక సరస్సులో జారవిడిచారు. అక్కడ కమలవనలక్ష్మి గర్భము నందున్న పిండములన్నీ ఏకమై, కుమారోత్పత్తి జరిగింది. ఆ సన్నివేశాన్ని నన్నెచోడుడు అద్భుతంగా చిత్రించాడు.
తారకాసురుని భయంతో, కంఠమెత్తటానికి జంకి, ఎక్కడో దాక్కున్న వేదధ్వనులు మళ్ళీ వ్యాపించటం మొదలుపెట్టాయి. నోరెత్తడానికి వెనుకాడి, పర్వతము గుహల్లో దాక్కున్న కిన్నర గంధర్వ గీతాలు మళ్ళీ వినిపించసాగాయి. తలలెత్తడానికి వెరచి, ఎక్కడో భూమి అడుగున దిగిపోయిన నవనిధులు, మళ్ళీ సంపూర్ణంగా తెరచుకోవడం మొదలుపెట్టాయి. ముఖం ఎత్తటానికి సంకోచించి, దిక్కుతోచని స్థితిలో ఉన్న, దిక్కాంతల ముఖపద్మాలు మళ్ళీ వికసించడం మొదలుపెట్టాయి. బలంతో, గర్వంతో, ఆకాశాన్నంటుకొని వెలిగే తారకాసురుని ఉద్ధతి (నక్షత్రముల కాంతి) తగ్గటం మొదలయ్యింది. విడిపోయి, బాధపడే దేవతలనే చక్రవాకాలు, జత గూడి మళ్ళీ విహరించటం మొదలుపెట్టాయి. ఈ విధంగా ఇనపదవితో (రాజ్యాధికారంతో), (సూర్యతేజస్సుతో), కుమారస్వామి ఉదయించాడు. పుట్టాడు.
ఈ పద్యం, కుమార సంభవానికి సంబంధించిన, నన్నెచోడుని కుమారసంభవము కావ్యము, దశమాశ్వాసము నందలిది.
No comments:
Post a Comment