బలిమిన్ మాధవ! నేడు నిన్ను భువనప్రఖ్యాతిగా బట్టుదున్
జలముల్ సొచ్చిన, భూమి క్రింద జనినన్, శైలంబుపై నెక్కినన్,
బలిదండన్ విలసించినన్, వికృతరూపంబుం బ్రవేశించినన్,
జలధిన్ దాటిన, నగ్రజన్మ హలి కాశ్వాటాకృతుల్ దాల్చినన్.
ఇది ఒక చిత్రమైన పద్యం. దశావతారాలను నిబంధించిన పద్యం. ఓయి కృష్ణా! నీవు ఎక్కడికి వెళ్ళినా గట్టిగా పట్టుకుంటానంటున్నాడు కాలయవనుడు.
నీటిలో దాక్కున్నా (మత్స్యావతారం), భూమి క్రింద దూరినా (కూర్మావతారం), కొండపైకి ఎక్కినా (వరాహావతారం), బలి అండదండలు తీసుకున్నా (వామనావతారం), వికృతరూపం దాల్చినా (నరసిం హావతారం), సముద్రాన్ని దాటినా (రామావతారం), బ్రాహ్మణ, దున్నేవాని, గుఱ్ఱపురౌతు రూపాలు ధరించినా (పరశురామ, బలరామ, కల్కి అవతారాలు), వదిలేది లేదు అంటున్నాడు.
భగవంతుని ఏ భావంతో గట్టిగా పట్టుకున్నా, ఆ పరమాత్ముని, పరమాప్తుని, కృపకు పాత్రులవుతారని ఆ దయయామయుడు (కామోత్కంఠత గోపికల్.......వైరక్రియా సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్) చెప్పిన మాటే. వైరభావంతో అసంకల్పితంగా యదార్థాన్ని చెప్పాడు కాలయవనుడు కాలాతీతుని గురించి.
ఈ పద్యం పోతన భాగవతము దశమ స్కంధములో ఉన్నది.
No comments:
Post a Comment