ప్రణవంబు నీవు నిర్మలగుణాలంకార!
యామ్నాయవిద్య యీ యలరుబోడి
తప మీవు శశికళోత్తంసభక్తినిధాన!
శాంతి యీ సంపూర్ణచంద్రవదన
ఫల మీవు వాతాపిఖలదర్పభంజన!
సత్క్రియ యీ గంధసారగంధి
మిహిరుండ వీవు విశ్వహితప్రవర్తక!
చైతన్యలక్ష్మి యీ చపలనయన
బ్రహ్మతేజంబు నీయందు బ్రజ్వరిల్లు
బ్రజ్వరిల్లు బతివ్రతాపరమతేజ
మీ లతాతన్వియందు మా కిందఱకును
నుభయతేజంబులును మహాభ్యుదయ మొసంగు.
దేవగురువు బృహస్పతి మునులను వెంటబెట్టుకొని కాశీ క్షేత్రంలో నున్న అగస్త్యుని వద్దకు వచ్చి, మేరుపర్వతము మీద స్పర్థతో, సూర్య గమనాన్ని నిరోధిస్తూ, ఎత్తుకు పెరుగుతున్న వింధ్యపర్వతం గర్వం అణచాలని అభ్యర్థించాడు. ఈ సందర్భంగా, ఆ పుణ్యదంపతులను ప్రస్తుతిస్తూ చేసిన పద్య మిది.
అగస్త్యుడు ప్రణవ స్వరూపుడైతే, లోపాముద్ర వేదవిద్య. ఆతడు తపస్సైతే, ఆమె శాంతి. అతడు ఫలమైతే, ఆమె ఫలాన్నిచ్చే క్రియ. అతడు సూర్యుడైతే, ఆమె అందులో నున్న చైతన్యము. ఈ ఇద్దరిలో, ఒకరియందు బ్రహ్మజేజము ప్రకాశిస్తుంటే, ఇంకొకరియందు పరమ పతివ్రతా తేజం వెలుగొందుతున్నది. ఈ విధంగా యీ రెండు కాంతిపుంజములు విశ్వాభ్యుదయానికి తోడ్పడుతున్నాయి.
ఈ పద్యాన్ని పరిశీలిస్తే, వేదములు ప్రతిపాదించే ఓంకారము, తపస్సు వలన సాధించే సత్త్వము, క్రియల వలన వచ్చే ఫలము, సూర్యునిలో నున్న వెలుగు, అవిభాజ్యమని తెలుస్తుంది. ఇదే విషయాన్ని, శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథ సత్యనారాయణగారు, శ్రీరాముడు జలమైతే సీత ప్రవాహమనీ, ఆయన ఆకాశమైతే ఆమె శబ్దమనీ, ఆయన ఇంద్రుడైతే ఆమె హవిస్సు అనీ, ఆయన శ్రుతి అయితే ఆమె స్వరమనీ, ఆ ఇద్దరికీ గల అవినాస్థితిని తెలియజేసారు.
ఇక పద్యంలో అగస్త్యుని పరంగా, లోపాముద్ర పరంగా శ్రీనాథుడు వాడిన విశేషణాలు వారిద్దరి మహత్వాన్ని తెలియజేస్తాయి.
ఈ సీసపద్యం శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము ద్వితీయాశ్వాసములో నున్నది.
No comments:
Post a Comment