జాగ్రదవస్థ నేమి యన స్వప్న సుషుప్తుల గూడ రామ నా
మ గ్రహణంబె నావయిన మానసజిహ్వలు సేయు దత్కథా
ప్రగ్రహకృష్టి సంశ్లథ ధురావశమై చను మన్మనోశ్వమో
యుగ్రుడ నీవ సారథివ! యూనుము పగ్గములన్ కరంబులన్.
మనస్సుకు మూడు అవస్థ లుంటాయి. జాగ్రత్ (మేలుకొన్న), స్వప్న (నిద్రిసున్నా కలలు కంటున్న), సుషుప్తి (గాఢ నిద్ర) అవస్థలు. ఈ మూడు స్థితులలోను, తన మనసు రామనామమే జపిస్తూ ఉంటుందని అంటున్నారు విశ్వనాథ. అయితే, మనసనేది వేగంగా పరుగెడుతున్న గుఱ్ఱం లాంటిది. దానిని సరిగా నడిపించాలంటే, గుఱ్ఱపు రౌతు నేర్పరియై ఉండాలి. అందువల్ల, తాను తలపెట్టిన రామకథ రచనను, సరిగా నడిపించడానికి, పగ్గాలను తన చేతిలోనికి తీసుకొనమని సారథియైన శివుని వేడుకుంటున్నారు విశ్వనాథ. ప్రగ్రహము అంటే కళ్ళెము.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము అనే కావ్యాన్ని శివునికి అంకిత మిచ్చారు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలోని యీ పద్యము చాల ప్రసిద్ధమైనది.
No comments:
Post a Comment