సగరు నలుం బురూరవు ద్రిశంకుసుతుం బురుకుత్సు గార్త
వీర్యు గయుం బృథుం భగీరథు సుహోత్రు శిబిం భరతుం దిలీపునిన్
భృగుకులు యౌవనాశ్వు శశిబిందు ననంగుని నంబరీషు బూ
రు గురుని రంతి రాఘవు మరుత్తుని గాలము కోలుపుచ్చదే.
ఈ పద్యంలో షట్చక్రవర్తుల, షోడశ మహారాజుల ప్రస్తావన ఉంది. చక్రవర్తులు ఆరుగురు, మహారాజులు పదహారుగురు. వీరందరు లోకప్రశస్తి వహించినవారు, విశేషమైన కీర్తి గడించినవారు. అయినప్పటికీ, కాలగతిలో కలిసిపోయినవారే. ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకొంటే, శరీరము అనిత్యమైనదని, భగవచ్చింతన మోక్షదాయకమని బోధపడి, మానవజీవితం ధర్మమార్గంలో గడపడానికి దోహదపడుతుంది.
సగరుడు, కార్తవీర్యుడు, హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు అనే ఆరుగురు షట్చక్రవర్తులు.
ఇక, గయుడు, పృథువు, భగీరథుడు, సుహోత్రుడు, శిబి, భరతుడు, దిలీపుడు, పరశురాముడు, యువనాశ్వుని పుత్రుడైన మాంధాత, శశిబిందుడు, అనంగుడు, అంబరీషుడు, పురుని తండ్రియైన యయాతి, రంతిదేవుడు, రాముడు, మరుత్తుడు, అనే యీ పదహారుగురిని షోడశమహారాజులంటారు.
ఆంధ్రమహాభారతం శాంతిపర్వంలో, కవిబ్రహ్మ తిక్కనసోమయాజి పదహారు సీసపద్యాలలో షోడశమహారాజుల చరిత్రలను అద్భుతంగా వర్ణించారు.
షట్చక్రవర్తులను, షోడశమహారాజులను వరుసగా చెప్పడం కష్టం కనుక, పెద్దవాళ్ళేమిటి, పిల్లలేమిటి, యీ పద్యాన్ని బట్టీయం వేస్తే, చక్కగా గుర్తుంటారు.
ఇంతమంది ధర్మమూర్తులను గుదిగుచ్చి, శ్రీకృష్ణదేవరాయలవారు ఆముక్తమాల్యద అనే మహాప్రబంధం ద్వితీయాశ్వాసం ద్వారా తెలుగు జాతికి అందించారు.
No comments:
Post a Comment