పంచాక్షరీమంత్ర పారాయణమునకు
నెవ్వాని మానసం బేడుగడయు
దర్పోద్ధతులగు వాతాపికిల్వలునకు
వధశిలాస్థాన మెవ్వాని కుక్షి
యాది నెవ్వాని దివ్యావతారమునకు
పూర్ణాంబుకుంభంబు పురిటియిల్లు
మెఱసి లోపాముద్ర మెఱుగు బాలిండ్లపై
బవళించు నెవ్వాని భవ్యమూర్తి
కసరి యెవ్వాని కంఠహుంకార రావంబు
కొండపాములకులములో కూర్చె నహుషు
నట్టి పరమమహాశైవు నలఘుతేజు
వెదకి రానందవనములో విబుధమునులు.
సప్తర్షులలో నొకడైన అగస్త్యుని గొప్పదనాన్ని వివరించే యీ సీస పద్యము కాశీఖండము ద్వితీయాశ్వాసము నందలిది. కాశీ క్షేత్రానికి విచ్చేసిన అగస్త్యుడిని కలుకొనడానికి , కాశీ నగరంలో ఉన్న పండితులు, మునులు వచ్చారు.
" నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రము యెవరి మనస్సులో స్థిర నివాసము యేర్పరచుకొన్నదో, గర్వంతో మిడిసిపడుతున్న వాతాపి, ఇల్వలుడు అనే అన్నదమ్ములకు యెవరి ఉదరము వధించే స్థలమో, యెవని దివ్యమైన దేహమునకు నీటికుండ పుట్టినిల్లో, పతివ్రతాశిరోమణి లోపాముద్ర సౌశీల్యానికి యెవరు హక్కుదారో, యెవరి హుంకారధ్వని నహుషుని కొండశిలువగా మార్చిందో, అటువంటి పరమ మాహేశ్వరుడు, తేజోమూర్తి అయిన, అగస్త్యుని కొరకు, పండితులు, మునులు, కాశీక్షేత్రములో వెదికారు. "
ఈ పద్యములో అగస్త్యుని మహత్వాన్ని తెలియజేసే వాతాపి ఇల్వలుల కథ, నహుషుని కథ ఉన్నాయి. అవన్నీ, అగస్త్యుడు లోకహితం కోరి చేసినవే.
No comments:
Post a Comment