నానా సూనవితాన వాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాకన్ దపంబంది యొ
షా నాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్య సంవాసియై
పూనెన్ బ్రేక్షణమాలికా మధుకరీ పుంజంబు నిర్వంకలన్.
ఇది వసుచరిత్రము ద్వితీయాశ్వాసంలోని పద్యం. ఈ పద్యానికి యీ పద్యమే సాటి. అంత ప్రసిద్ధమైన పద్యం.
సారంగము అంటే తుమ్మెద. గంధఫలి అంటే సంపెంగ పువ్వు. తుమ్మెదలు అన్ని పూలమీద వ్రాలి మకరందాన్ని గ్రోలుతాయి. ఒక్క సంపెంగపువ్వు తప్ప. అందుకని సంపెంగకు కోపం వచ్చింది. ఆ కాకతో, ఘోరమైన తపస్సు చేసి, స్త్రీ యొక్క ముక్కుగా పుట్టింది. అప్పుడు ఆడువారి ముక్కుగా రూపాంతరం చెందిన సంపెంగిపువ్వుకి రెండువైపులా తుమ్మెదలు బారులు తీరినాయి. స్త్రీలయొక్క ముక్కుకి ఇరుప్రక్కల నున్న కనుబొమలను, కంటికాంతులను, తుమ్మెదల బారులుగా చెప్పడం కవిసమయం. కనుబొమలు తుమ్మెదల బారులు లాగా నల్లగా ఉంటాయి గదా!
పువ్వులు స్త్రీలు, తుమ్మెద పురుషుడు. పువ్వులపై వ్రాలే తుమ్మెదల గురించి కృష్ణశాస్త్రిగారు కృష్ణపక్షంలో అద్భుతమైన పద్యాలు వ్రాసారు.
No comments:
Post a Comment