ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుద ప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి; యుగ సంధుల నిల్చియు గాలు చేతి బల్
త్రొక్కుల నమ్మనుప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే?
మధురానగర రాజు, భోగిని అనే వేశ్యాసమాగమానికి వెళ్తూ, దారిలో పరదేశ బ్రాహ్మణుడు వల్లించిన సుభాషితం విన్నాడు. సున్నితమనస్కుడైన రాజు మనస్సు వికలమయింది. రాజు, అశాశ్వతమైన సౌఖ్యానుభవం గురించి యీ విధంగా తలపోశాడు.
" అయ్యో! ఈ రాజ్యవైభవా లేమిటి? భోగా లేమిటి? వీటిని చూసి మురిసిపోవడ మేమిటి? ఇవన్నీ నీటి బుడగ వంటి యీ శరీరం కోసం కదా చేసింది? శరీరం మీది మమకారంతో, మోక్షాన్ని గురించి పట్టించుకోలేదే? యుగాల మధ్య కాలంలో బ్రతికిన మనువు వంటి వారు కూడా, యముని దెబ్బకు రూపురేఖలు లేకుండా పోయారే! "
ఆముక్తమాల్యద ద్వితీయాశ్వాసంలోని యీ పద్యం పాండ్యరాజు మత్స్యధ్వజుని మనస్సంక్షోభాన్ని తెలియజేస్తుంది.
No comments:
Post a Comment