ధనములు సాల గల్గి సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్
మనమున నెన్నడున్ సుకృతమార్గము పొంతకు బోక లోభమో
హనిహతబుద్ధులై తిరుగునట్టి జనుల్ పరలోక సౌఖ్యముల్
గనుటకు నేర; రిప్పటి సుఖంబులు మేలయి తోచు వారికిన్.
లోకంలో ఇహము, పరము అనే రెండు పదాలు వింటుంటాము. ఇహము అంటే, ఈ లోకానికి సంబంధించినది. పరము అంటే మరణానంతరము సంభవించేది. ధనము కూడబెట్టి, ఎప్పుడూ ఇంద్రియ సుఖాలు కోరుకుంటూ, మనస్సులో పుణ్యచింతన లేకుండా, లోభ మోహాలకు వశులైపోయేవారు, పరలోక సౌఖ్యాన్ని గురించి ఆలోచించరు. వారికి ఇప్పటి సుఖాలే బాగుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని, ధర్మ మార్గావలంబులై, మోక్షపథాన్ని చేరడము సనాతన సంప్రదాయ పద్ధతి. దీనిని గురించి మార్కండేయమహర్షి ధర్మరాజునకు వివరించడమే యీ పద్యము యొక్క భావము.
ఇది ఎఱ్ఱన పూరించిన అరణ్యపర్వము చతుర్థాశ్వాసము లోనిది.
No comments:
Post a Comment