దమమును సత్యయుక్తియును ధైర్యనిరూఢియు నిత్యతృప్తియున్
శమమును నీకు నైజములు; సన్మతి నర్థవశంబు గామలో
భములును బొంద వట్లగుట పార్థివకుంజర! ధర్మరాజ నా
మమున ద్రిలోకపూజ్యమహిమం బొగడెందెద వివ్విధంబునన్.
వనవాసంలో ఉన్న పాండవులను చూడటానికి సత్యభామాసహితుడై వచ్చిన కృష్ణుడు ధర్మరాజు గుణగణాలను యీ విధంగా వర్ణించాడు.
" ఇంద్రియాలను అదుపులో పెట్టడము, సత్యవాక్పరిపాలన, చిత్తస్థైర్యము, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండటము, అంతరింద్రియ నిగ్రహము, నీకు సహజ గుణాలు. వాటికి తోడు, నీకు మంచి బుద్ధి ఉండటం వల్ల, ధనం మీద ఆశ లేకుండటము, కోరికలు, లేకుండటము వలన ధర్మరాజు అనే సార్థకనామధేయముతో ముల్లోకాల్లోను కీర్తిని పొందుతూ ఉన్నావు."
ధర్మరాజు గొప్పదనాన్ని చెప్పే యీ పద్యము ఎఱ్ఱన పూరించిన అరణ్యపర్వశేషము లోనిది.
No comments:
Post a Comment