తారుణ్యాతిగ చూత నూత్న ఫలయుక్తై లాభిఘార స్వన
ద్ధారా ధూపిత శుష్యదంబు హృత మాత్స్య చ్ఛేద పాకోద్గతో
ద్గారంపుగన రార్చు భోగులకు సంధ్యా వేళలం గేళి కాం
తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంత ర్నారికేళాంబువుల్.
ఇది ఎండకాలం వర్ణన. మామిడికాయలు వచ్చే రోజులు. చెరువుల్లో నీళ్ళు ఎండిపోయి, బురదగుంట లేర్పడతాయి. అందులో పట్టిన చేపలు చాలా రుచిగా ఉంటాయి. ఈ విషయం భోగులకు తెలుసు. పలు వంటకాల రుచులను ఆస్వాదించే భోగులకు ఇదొక మంచి సమయం. అటు పిందెలు కాకుండా, మరీ ముదరకుండా ఉన్న మామిడికాయలను తీసుకు వచ్చి, వాటిని ముక్కలుగా తిరిగి, అదేరకంగా, పైన చెప్పిన చెరువులలో నుండి తెచ్చిన చేపలను ముక్కలుగా తరిగి, ఎత్తుకు యెత్తు నూనెపోసి, బాగా పొగబారేటట్లు తిరగమోత పెట్టి చేసిన కూరను భుజిస్తారు. సాయంత్రం అయ్యేటప్పటికి, కనరు వాసనతో త్రేపులు రావడం మొదలుపెడతాయి. వాటిని పోగొట్టుకోవడానికి, యీ భోగులు ఏం చేస్తారు? అక్కడ తోటలలో, ఇసుక క్రింద పాతిబెట్టిన చల్లని కొబ్బరిబోండాల నీళ్ళు త్రాగుతారు. భుక్తాయాసం కలిగించే చేపల కూరకు అది విరుగుడన్నమాట. తాటి ముంజలకు ఆవకాయబద్ద లాగా.
మామూలుగా, రుచికరమైన వంటకాలను తినడం సామాన్య విషయం. ఆ రుచిని ఆస్వాదించి, ఆ వంటకపు విశేషాలను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకొనడం, విశేషం, అంతేగాక, భోగలక్షణం.
శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడే గాక, ఒక భోగి అని కూడా యీ పద్యం వల్ల తెలుస్తున్నది. చక్రవర్తులు సహజంగానే భోగులు కదా!
ఈ ప్రసిద్ధమైన పద్యం ఆముక్తమాల్యద, ద్వితీయాశ్వాసములో నున్నది.
No comments:
Post a Comment