అంకము జేరి శైలతనయాస్తన దుగ్దము లానువేళ బా
ల్యాంకవిచేష్ట దొండమున నవ్వలిచన్ గబళింప బోయి యా
వంక కుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్.
ఇది మనుచరిత్రము అవతారికలో విఘ్నేశ్వరస్తుతి రూపమైన ప్రసిద్ధమైన పద్యము. మాయ యెంత దుస్తరమైనదో చెప్పే పద్యము.
బాలగణపతి అమ్మవారి ఒళ్ళో కూచున్నాడు. పాలు తాగుతున్నాడు. పిల్లవాడు కదా! గజముఖుడు కూడా. అందుకని, పాలు తాగుతూ, పిల్లచేష్టగా తొండముతో అవతలివైపు కుచమును మ్రింగబోయాడు. కుచమును మ్రింగబోవడమేమిటి? ఏనుగుకు వెలగపండు అంటే ఇష్టం కదా! అందుకని. కానీ, అక్కడ పాముని చూసాడు. పాముని చూడడము యేమిటి? శివుడు అర్థనారీశ్వరుడు. అమ్మవారికి అర్థభాగంలో ఉండేది సర్పభూషణుడైన శివుడు కదా! ఆ పామును తామరతూడు అనుకొని పట్టుకొనబోయాడు. ఏనుగుకి తామరతూడంటే కూడా చాలా ఇష్టము. ఈ విధంగా భ్రమకు గురైన విఘ్నేశ్వరుడు మాకు అభీష్టసిద్ధి కలిగించు గాక అని యీ పద్య భావము.
మాయను తొలగించి, పనులకు అడ్డంకులు లేకుండా చేసేవాడు విఘ్నేశ్వరుడు. అటువంటి దేవుడే మాయకు లోనైతే ఇక సామాన్య మానవుల సంగతేమిటి? తాత్పర్యమేమంటే, మాయాకల్పితమైన యీ జగత్తులో, భగవత్కృప ఉంటేనే గానీ, ఏ పనీ నిర్విఘ్నంగా జరుగదు. అందువల్ల, కళ్ళకు కప్పిన మాయతెరలు తొలగించి పరతత్వాన్ని, అదేవిధంగా, రచనాతత్వాన్ని, తెలియజేయమని రచనారంభానికి ముందు పెద్దన ఆకాంక్షించాడని కూడా అనుకొనవచ్చును.
ఈ పద్యంలో భ్రాంతిమదాలంకారము ఉంది.
No comments:
Post a Comment