పూని యనేకజన్మముల బొంది తుదిం తన పుణ్యకర్మ సం
తానము పేర్మి గర్మ వసుథాస్థలి బుట్టి ప్రపూర్ణదేహుడై
మానవుడై గృహేచ్ఛబడు మందు డజంబు తృణాభిలాషియై
కానక పోయి నూతబడు కైవడి నీ పదభక్తిహీనుడై.
కాలయవనుడు కృష్ణుని వెంబడిస్తూ ముచికుందుడు ఉండే గుహలోకి వస్తాడు. అక్కడ గుహలో నిద్రిస్తున్న ముచికుందుణ్ణి కృష్ణునిగా భ్రమించి కాలితో తన్నుతాడు. కనులు తెరచిన ముచికుందుడు, కాలయవనుని భస్మం చేస్తాడు. తరువాత, తన యెదుట నిల్చిన కృష్ణుణ్ణి స్తుతిస్తూ, మాయకు లోనై, మానవులు స్త్రీ పురుష భేదం లేకుండా, ధనగృహాదులను సంపాదించడంలో మునిగిపోయి, హరిపద సేవనం మరచిపోయారని, జీవులు బుద్ధిహీనులై, 'పునరపి జననం, పునరపి మరణం' అని శంకరభగవత్పాదులు చెప్పినట్లుగా జనన మరణ చక్రంలో తిరుగుతూ కొట్టుమిట్టాడుతున్నారని, ఆవేదన వెలిబుచ్చాడు..
జీవి అనేక జన్మలు ఎత్తుతూ, తాను చేసిన పుణ్యం ఫలితంగా, కర్మక్షేత్రమయిన దేశంలో పూర్ణదేహంతో, మానవుడిగా పుడతాడు. ఆ విధంగా పుట్టి కూడా, తన మూఢత్వం వలన, ఒక గొఱ్ఱె కనుక గడ్డిపరకల మీద ఆశతో, వెళ్ళి వెళ్ళి నూతిలో పడ్డట్లు, భగవంతుని పదభక్తి మరచిపోయి, కోరికలకు వశుడై పోయి, మళ్ళీ మళ్ళీ జననమరణ చక్రంలో పడుతున్నాడు.
ఇదీ సాంసారిక జీవితంలో జరుగుతున్న తంతు. వృద్ధాప్యం వచ్చేవరకూ, ఏ మాత్రం ఆధ్యాత్మిక చింతన లేకుండా, చరమదశలో, భగవంతుని స్మరణ చేయాలన్నా, శరీరం సహకరించక చేయలేక, తన జీవితపరమార్థం యేమిటని వేదనను అనుభవిస్తుంటాడు. ఇది జీవుని వేదన. ఇదీ జీవుని వేదన!
ఈ పద్యం ఆంధ్రమహాభాగవతము దశమస్కంధములో ఉంది.
No comments:
Post a Comment