వెలుగు కుమారతేజమున వేడిమి తాకినయంత వేయి గ
న్నులతో మిఱుమిట్లువోయిన గనుంగొన నేరక మూసికొన్న ఱె
ప్పలు కమరంగ విచ్చె నురుభాస్కరతీవ్రకరప్రభాతికి
న్నులికి రయంబున న్మొగిడియున్న కుముద్వతివోలె భీతితోన్.
నారదుడు బాలకార్తికేయుని తేజోవిశేషాలను దేవేంద్రునికి వివరించాడు. ఈ వార్తను వినగానే, భయకంపితుడైన దేవేంద్రుడు, కుమారస్వామిపై దండెత్తి వచ్చాడు. కుమారస్వామి తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు.
ఇది చాలా అందమైన పద్యం. కుమారస్వామి సరస్సులో పుట్టాడు. ఆ సరస్సు కుముద్వతి అనగా తెల్లకలువలతో నిండియున్న సరస్సు. ఆ తెల్లకలువలు తీక్ష్ణమైన సూర్యకిరణాలతో ముడుకొనిపోయాయి. కుమారస్వామిని చూడగానే, ఇంద్రుని వేయికన్నులు, మిరుమిట్లు గొలిపాయి. అమితమైన తేజస్సుతో వెలిగిపోయే ఆ బాలుని నేరుగా చూడలేక భయంతో ఇంద్రుని ఱెప్పలు ముడుచుకుపోయినాయి. ముడుచుకొన్న ఆ ఱెప్పలు, కుమారస్వామి తేజస్సు వేడికి కమిలిపోగా, ఇంద్రుడు అప్పుడు మెల్లిగా కళ్ళు విప్పాడు.
ఈ పద్యంలో తెల్లకలువల సరస్సుగా ఇంద్రుని, సూర్యునిగా బాలకుమారస్వామిని పోల్చడము, ఉరుభాస్కరతీవ్రకరప్రభాతికి, ఇంద్రుని వేయికన్నులు ముడుచుకొనిపోవడము ఔచితీభరితంగా ఉంది.
పైన చెప్పబడిన పద్యం నన్నెచోడుని కుమారసంభవము దశమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment