ఎట్టి విశిష్టకులంబున
బుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్
గట్టిన కర్మఫలంబులు
నెట్టన భోగింపకుండ నేర్తురె సుజనుల్.
భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్ముతారు. కర్మసిద్ధాంతాన్ని ప్రతిపాదించే యీ పద్యం చాలా ప్రసిద్ధమైనది.
మృగయావినోదియై వేటకు వెళ్ళి, సంగమిస్తున్న లేళ్ళ జంటను పొరపాటున చంపాడు పాండురాజు. అంత్యఘడియలలో నున్న మగలేడి, తాను కిందముడనే మునినని తెలియపరచి, చేసిన తప్పునకు పాండురాజును శపిస్తాడు. చింతాక్రాంతుడైన పాండురాజు మనోగతాన్ని, యీ పద్యం చక్కగా విశ్లేషిస్తుంది.
" మనిషి యెంత గొప్పదైన వంశంలో పుట్టినా, మంచిచెడుల పరిజ్ఞానం కలిగిన ఉన్నా, పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు కదా! "
విధి కంటె కర్మ బలీయమని పెద్దలు చెబుతారు. అదే భావం పాండురాజు మాటల్లో గోచరిస్తుంది.
ఆంధ్రమహాభారతము ఆదిపర్వంలోని యీ పద్యం కూడా నన్నయ సూక్తినిధిత్వానికి ఒక మచ్చుతునక.
No comments:
Post a Comment