అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండగా
నురగుల నెల్ల గాచిన మహోరగనాయకు డానమత్సురా
సుర మకుటాగ్రరత్నరుచిశోభితపాదున కద్రినందనే
శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకు బ్రసన్ను డయ్యెడున్.
నన్నయగారు ఆంధ్రీకరించిన మహాభారతము ఆదిపర్వములో ఉదంకోపాఖ్యానము చాల ప్రసిద్ధి చెందినది. ఎందరో కవి పండిత విమర్శకులు దీనిపై వ్యాఖ్యానించారు. .
మహాభారతము నందు యెన్నో ఉపాఖ్యానా లున్నాయి. కథ చెబుతున్నట్లు పైకి కనిపించి, అంతరాంతరమందు సూక్ష్మ సూక్ష్మ తరములైన బహ్వర్థములను సం యోజించడం, బహు జన్మ తపఃఫలం వల్ల గాని సాధ్యంగాదని, అట్టి పరిణత మనస్కుడైన మహాశిల్పి నన్నయగారని బ్రహ్మశ్రీ ధూళిపాళ శ్రీరారామమూర్తి గారన్నారు. ఇట్టి పరిణత శిల్పాన్ని పట్టియిచ్చే బహుకథలను కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తమ " నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి " అనే విమర్శన గ్రంథంలో వ్యాఖ్యానించి చూపారు. అందులో ఉదంకుని కథ ఒకటి.
గురువుగారైన సత్యనారాయణగారి అడుగుజాడల్లో నడుస్తూ, ఉదంకుని కథను " నన్నయగారి కథా శిల్పము " అనే సిద్ధాంతవ్యాసములో శ్రీరామమూర్తిగారు తరచి చూపారు.
వారి వ్యాఖ్యానాన్ని, కథాసూత్రము కొంత వివరించిన తరువాత, మీ ముందుంచుతాను.
కుండలాలను అపహరించిన తక్షకుణ్ణి వెంబడిస్తూ నాగలోకానికి వెళ్ళిన ఉదంకుడు, నాగశ్రేష్ఠుడైన అనంతుడిని స్తుతించిన తరువాత, వాసుకిని గురించి స్తోత్రం చేస్తాడు. ఈ స్తోత్రములో వ్యంగ్యము ధ్వనిస్తుంది. ఏమిటా వ్యంగ్యము? ఇంటిలోని నలుగురు అన్నదమ్ములలో, పెద్దవాడు ఊరికి పెత్తందారు. అతడు ఆదిశేషుడు. ఇక రెండవ వాడు వాసుకి. ఇల్లు చక్కదిద్దుకొనేవాడు.
ఇక ఇక్కడనుండ, బ్రహ్మశ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తిగారి వ్యాఖ్యానము చదువుదాము.
" ఇల్లు దిద్దికొనిపోవు రెండవ వాడున్నాడు. అతనితో నేమందుము? ఆ యింటికి సంబంధించిన తత్పూర్వపు సంఘటన మేదియో ప్రస్తావించి ఫలానా వాడు మీకపకారము చేసినప్పుడు నీవు వారిని రక్షించుకొనుట కెన్ని పాట్లు పడితివో గుర్తులేదా? మరి మీ పిల్లలితరుల కపకారము చేయుచున్నప్పు డూరకుందు వేమి? అందుము. ఈ యనుట లోకములో వ్యంగ్యముగా నన వచ్చును, వాచ్యముగా నన వచ్చును. కవిత్వము నందు మాత్రము వ్యంగ్యముగానే యనవలయును. అందుచేత ' అరిది తపోవిభూతి నమరారుల బాధలు వొందకుండగా నురగుల నెల్ల కాచిన మహోరగ నాయకు డన్నాడు. మీ వారిని బాధల నుండి కాపాడుకొంటివి. మీ వారు కూడ బాధలు చేయకుండ చూచు బాధ్యత నీ యందున్నది అని వ్యంగ్యము. మరి నీ వెట్టివాడవు? ' అద్రినందనేశ్వరునకు భూషణమవు. ఆ అద్రినందనేశ్వరు డెట్టివాడు? ' ఆ నమత్సురాసుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాదుడు. '. దేవరాక్షసుల శిరోభూషణము లాయనకు పాద భూషణములైనను కావు. అట్టివానికి నీవు భూషణమవు. మీ తమ్ముడు భూషణ మపహరించుటయేమి? నీ కెంత యప్రతిష్ఠయో చూడుమని వ్యంగ్యము. "
ఈ విధముగా యిందు ఆక్షేపణ వ్యంజ్యమానమై, పద్యమున కొక్క వ్యంగ్యార్థమును ప్రసాదించుచున్నది.
No comments:
Post a Comment