చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాడు
రచియించితిని మరుత్తరాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యౌవనమున
శాలివాహన సప్తశతి నొడివితి
సంతరించితి నిండుజవ్వనంబునను శ్రీ
హర్ష నైషధ కావ్య మంధ్రభాష
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమున గొని
యాడితి భీమనాయకుని మహిమ
బ్రాయమెంతయు మిగుల గైవ్రాలకుండ
గాశికాఖండమను మహాగ్రంథమేను
దెనుగు జేసెద గర్ణాటదేశకటక
పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి.
శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము అవతారిక లోనిది యీ పద్యము.
ఈ పద్యాన్ని బట్టి, శ్రీనాథుడు చాలా చిన్ననాటినుండి కవిత్వం వ్రాయడం ప్రారంభించి, తన జీవితకాలమంతా అద్భుతమైన కవితాసృష్టి చేసినవాడుగా దర్శనమిస్తాడు. పైన పేర్కొన్న మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి అలభ్యాలు. శ్రీనాథుని శృంగారనైషధము, కాశీఖండము, హరవిలాసము, భీమేశ్వరఖండము ఆంధ్ర సాహిత్యంలో చాలా ప్రసిద్ధి వహించిన గ్రంథాలు.
శ్రీనాథుని గొప్పతనాన్ని గూర్చి చెప్పేటప్పుడు యీ పద్యం గుర్తుకువస్తుంది.
No comments:
Post a Comment