వినియె, నెలల్చతుర్ద్వయిని వృష్టిదినాళికి, రాత్రికై దివం
బున, జరకై వయస్సునను, బూని, పరంబున కిప్పుడు ద్యమం
బనువుగ జేయగా వలయునంచు బురోహిత ధర్మ మాత్మ గీ
ల్కొన నల విప్రుడా ద్విజులలోన సుభాషితమున్బఠింపగన్.
పాండ్యదేశ రాజధాని మధురానగరం. ఆ దేశపు రాజు ఒకరోజు భోగిని అనే వేశ్య దగ్గరకు పోతుండగా, వీధి అరుగుల మీద పడుకుని, ఉబుసుపోక సుభాషితాలు చదువుతున్న బ్రాహ్మణుల మాటలు విన్నాడు. అందులో, రాజపురోహితుని ఇంట్లో భోజనం చేసిన ఒకాయనున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఒక సుభాషితం చదివాడు. అదేమిటంటే, వానాకాలం బయటికి వెళ్ళలేము కనుక, తక్కిన ఎనిమిది నెలలు, రాత్రిపూట పనిచేయలేము కనుక పగలు, ముసలితనంలో శరీరం సహకరించదు కనుక యవ్వనంలో, కష్టపడాలి. అదే విధంగా, పరలోక సౌఖ్యం కోసం, ప్రయత్నపూర్వకంగా, ఈ లోకంలోనే కష్టపడాలి.
నెలలు చతుర్ద్వయిని = రెండు నాలుగులు = ఎనిమిది నెలలు
ఈ మాటలు రాజు సున్నిత హృదయం మీద బాగుగా పనిచేసాయి.
పూర్వం, సుభాషితాలు, నీతి శతకాలు అందరి ఇళ్ళలో చదువుకునేవారు. పిల్లల చేత శతక పద్యాలు వల్లె వేయించేవారు. దాని వల్ల, వాళ్ళలో, నీతి నియమాల పట్ల, ధర్మం పట్ల ఒక అవగాహన, అనురక్తి కలిగేది. రాను రాను ఇది తగ్గిపోతున్నది. ఇది సమాజానికి మంచిది కాదు. చిన్నతనంలోనే, పిల్లలకు ధర్మం, నీతి, నిజాయితీ పట్ల అవగాహన పెంచాలి.
ఈ పద్యం ఆముక్తమాల్యద, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment