భ్రమరా! దుర్జనమిత్ర ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్ప్రాణేశదామప్రసూ
న మరందారుణానతుండ వగుటన్ నాథుండు మన్నించు గా
క మము న్నేపుచు బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్.
భాగవతము దశమస్కంధము లోని భ్రమరగీతలు పూర్వం రోజుల్లో ఎంత పేరుపడ్డవి అంటే, పల్లెటూళ్ళలో పుట్టి, పెద్దగా చదువుకోని స్త్రీలు, ఇళ్ళలో పనిపాటలు చేసుకుంటూ పాడుకునేవారు. ఒక్కొక్క పద్యం వింటుంటే, పాడుతుంటే, ఆ గొల్లపడుచులతో తాదాత్మ్యం చెందుతుంటే, ఆ మదురభక్తికి ఒళ్ళు పులకరించిపోతుంది. అటువంటి, భ్రమరగీతల్లో మొదటి పద్యమిది.
" ఓ తుమ్మెదా! నీవు చెడ్డవారి స్నేహం చేసేవాడివి. తగుదునంటూ వచ్చి మా పాదపద్మాలు తాకకు; మా ప్రాణవల్లభుని పూదండలలోని తేనెను త్రాగి, మధురానగర స్త్రీలస్తనకుంకుమతో యెఱ్ఱబడ్డ నీ ముఖం (అందం) చూసి అతడు మన్నిస్తాడేమో గానీ, విరహాగ్నితో కాల్చుకుతింటూ, అక్కడ నగరకాంతల శోభనగృహాలలో కులుకుతుండే నిన్ను, మేము మాత్రం మన్నించము."
శ్రీకృష్ణుని సందేశాన్ని వినిపించడానికి నందగోకులానికి వచ్చాడు ఉద్ధవుడు. గోపికలను కలిసాడు. కృష్ణుడు వారినెవ్వరినీ మరచిపోలేదని చెప్పాడు. కానీ, విరహవేదనతో మ్రగ్గిపోతున్న గోపికలు, సమయానుకూలంగా, ఆ సమీపంలో తిరుగుతున్న తుమ్మెదను ఉద్దేశించి చెబుతున్నట్లుగా, తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. సాహిత్య పరిభాషలో దీనిని అన్యాపదేశం అంటారు. అంటే ఇతరుల మీద పెట్టి అని.
ఈ పద్యంలో, తుమ్మెదను చాటుగా చేసుకొని ప్రతి ఒక్క గోపిక పెదవుల నుండి వచ్చే మాట, పైకి నిందగా కనిపించి, హృదయంలో వారికి కృష్ణునిపై గల చెప్పలేనంత మధురభక్తిని తెలియబరుస్తుంది.
పోతనగారి పుణ్యమా అని యీ భ్రమరగీతలకు స్వంతదారులైన తెలుగువారు ధన్యులు గదా!
No comments:
Post a Comment