తపముల జేసియైన, మఱి దానము లెన్నియు జేసియైన, నే
జపముల జేసియైన ఫలసంచయ మెవ్వని జేర్పకున్న హే
యపదములై దురంత విపదంచిత రీతిగ నొప్పుచుండు న
య్యపరిమితున్ భజించెద అఘౌఘనివర్తను భద్రకీర్తనున్.
భగవంతుని గూర్చి తపించడం ఒక ఆధ్యాత్మిక సాధన. ఇతరుల కష్టాలు చూసి బాధపడి, మనకు ఉన్నదాంట్లో ఇతరులకు కొంచెం పంచిపెట్టడం దానం. ఈ రెండూ సంస్కార రూపంలో వస్తాయి. అయితే, పైన చెప్పిన తపదానాదులు ఈశ్వరార్పితబుద్ధితో చేయకుంటే, అవన్నీ నిందింపదగినవై, ఆపదలుగా రూపాంతరం చెంది, దుఃఖానికి కారణమౌతాయి. అందువల్ల, మనం చేసే పనులన్నీ మంచి పనులయినప్పటికీ, ఆ పనుల కర్తృత్వాన్ని మనకు ఆపాదించుకోకుండా, భగవదర్పణ చేస్తే, అవి మనకు దుఃఖం కలిగించకుండా, బంధవిముక్తులను చేస్తాయి. ఎందుకంటే, భగవంతుడు అపరిమతమైన శక్తి కలవాడు, పాపాల నుండి విముక్తి కలిగించగలిగినవాడు. ఉపనిషత్తుల నుండి భగవద్గీత వరకు అన్ని సద్గ్రంథాలు చెప్పే సత్యమిదే.
" సర్వధర్మాన్ పరిత్యజ్య/మామేకo శరణం వ్రజ/అహంత్వా సర్వపాపేభ్యో/మోక్షయిష్యామి మాశుచ. " అన్న గీతాశ్లోకం చెప్పేది యీ శరణాగతి తత్వాన్ని గురించే.
ఇంతటి చక్కని పద్యం శ్రీమదాంధ్రమహాభాగవతం ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment