హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ
కరమై యుండ దయోగ్య దుర్మదన దత్కాకోల గర్తాకృతిన్.
లోకకళ్యాణార్థము, పంచమవేదమని పిలువబడే మహాభారతము వ్రాసినప్పటికినీ, వ్యాసుడు చింతాక్రాంతుడై, దానికి కారణమేమిటని ఆలోచిస్తుండటం గమనించిన నారదుడు, అతనితో యీ విధంగా అన్నాడు.
" హరినామస్తుతి చేసే కావ్యం, బంగారు కమలాలతో, రాజహంసల గుంపుతో, సుందరంగా కనిపించే మానస సరోవరంలాగ ప్రకాశిస్తుంది. విష్ణునామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రమైన అర్థాలతో కూడుకొనియున్నప్పటికీ, దుర్గంధంతో, కాకోల విషంతో కూడుకొనియున్న బురదగుంటలాగ ఉంటుంది.
అది శోభస్కరంగా ఉండదు. "
మామిడిపండు మిస మిస లాడుతూ కనువిందు చేస్తున్నప్పటికీ, అందులో ప్రధానమైనది ఆ పండు రసం. ఆ తియ్యదనాన్ని ఆస్వాదించినవాడే ధన్యుడు. ఆ విధంగానే, భవబంధవిముక్తిని కలిగించే హరినామస్మరణ చేయగలగటమే జీవితానికి సార్థకత.
ఈ పద్యం, బమ్మెర పోతన రచించిన శ్రీమదాంధ్రమహాభాగవతము ప్రథమ స్కంధము లోనిది.
No comments:
Post a Comment