పరుడై, యీశ్వరుడై, మహామహిముడై, ప్రాదుర్భవస్థాన సం
హరణక్రీడనుడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
పరమేష్టి ప్రముఖామరాధిపులకుం, బ్రాపింపరాకుండు దు
స్తరమార్గంబున దేజరిల్లు హరికిం దత్వార్థినై మ్రొక్కెదన్.
పరమేశ్వరుడు, ప్రకృతి, జీవుడు. పై నుండి క్రిందికి ఇదీ వరుస. ప్రకృతికి, జీవునికీ పరుడు, అనగా, బయటివాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు సమస్త ప్రాణికోటికీ ప్రభువు. గొప్ప మహిమ కలవాడు, శక్తివంతుడు. సృష్టి, స్థితి, లయకారకుడు. త్రిశక్తియుతుడు అంటే, మూడు రకాలైన శక్తులు కలవాడు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవి, ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము అనేవి, సత్వము, రజస్సు, తమస్సు, అనే శక్తులు కలిగినవాడు. బాహ్యదృష్టికి గానరాని, లోపల ఉండే వెలుగు రూపమైనవాడు. బ్రహ్మాది దేవతలకు కూడా పొందరాక, అందుకొనడానికి సాధ్యము కాని కష్టతరమైన మార్గాలలో ప్రకాశించే, విష్ణువు అనే ఆ మహత్తత్వానికి నమస్కరిస్తున్నాను అంటున్నాడు శ్రీశుకుడు.
ఇదంతా ఎవరికి చెబుతున్నాడు? బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసువైన పరీక్షిన్మహారాజుకు.
ప్రార్థనకు అనువైన యీ పద్యం శ్రీమదాంధ్రమహాభాగవతము ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment