తెలి నులి వెచ్చ యోగిరము దియ్యని చారులు దిమ్మనంబులున్
బలుచని యంబళు ల్చెఱకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధి శీతజలము ల్వడ పిందెలు నీరుజల్లయున్
వెలయగ బెట్టు భోజనము వేసవి జందన చర్చ మున్నుగన్.
శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్తమాల్యద ప్రథమాశ్వాసము లోని యీ పద్యములో వేసవికాల భోజనానికి సంబంధించిన విషయం వర్ణింపబడింది.
ఆతిథ్యమిచ్చే గృహస్థు ఎండపొడను పడి వచ్చేవారికి ముందు ఏం చేయాలి? ఉష్ణతాపాన్ని చల్లార్చే గంధాన్ని సమకూర్చడము, ఆ తరువాత భోజన పదార్థాలు వడ్డించడము. పద్యంలో చెప్పబడిన పదార్థాలన్నీ ఒంటికి చలువ చేసేవి. కొంచెము వేడిగా ఉన్న తెల్లని అన్నము, బెల్లం వేసి చేసిన తియ్యని చారు, తియ్యని పిండివంటలు (తిమ్మనంబులున్), పల్చని అంబళులు, పులుసులు, చెఱకు రసం, కొబ్బరినీళ్ళు (ఎడనీళ్ళు), తీపి భక్ష్యములు (రసావళుల్), పండ్లు, సుగంధభరితమయిన చల్లని పానీయాలు, వేసవి తాపాన్ని పోగొట్టడానికి ఊరవేసిన మామిడిపిందెలు (వడపిందెలు), చల్లగా ఉన్న పల్చని మజ్జిగ - వీటన్నిటితో పెట్టిన భోజనము.
వింటేనే వేసవితాపం తీరినట్లుగా ఉంది, ఇక పాటిస్తే నిజంగా ఎండకాలానికి భయపడవలసిన పని లేదు.
No comments:
Post a Comment