శ్రీకృష్ణదేవరాయలవారి ప్రౌఢమైన ప్రబంథము ఆముక్తమాల్యద. ఈ ప్రబంథము వర్ణనలకు పెట్టింది పేరు. ప్రథమాశ్వాసములోని యీ వర్షకాలము వర్ణన చదివితే, రాయలవారి సునిశిత పరిశీలన మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
గగనము నీరుబుగ్గ కెనగా జడి వట్టిన నాళ్ళు భార్య కన్
బొగ సొరకుండ నారి కెడపుం బొరియ ల్దగిలించి వండ న
య్యగపల ముంచి పెట్టు గలమాన్నము నొల్చిన ప్రప్పు నాలుగేన్
బొగపిన కూరలు న్వడియము ల్వరుగు ల్పెరుగున్ ఘృత ప్లుతిన్.
అవి వానకాలపు రోజులు. ఆకాశం నీటిబుగ్గలాగా ఉంది. బాగా ముసురు పట్టిందన్నమాట. తడి కట్టెలతో వంట చేస్తే, కంట్లోకి పొగబోయి మంటపుడుతుంది. అందుకనే, యెండబెట్టిన కొబ్బరిడిప్పలతో వంట చేస్తున్నది విష్ణుచిత్తుని భార్య. ఆ ఇంటికి యెప్పుడూ అతిథి, అభ్యాగతులు వస్తూనే ఉంటారు. విష్ణుచిత్తుడు భోజనానికి కూర్చున్నవారికి, కొబ్బరి చిప్పల గరిటెలతో ,పప్పు, నాలుగైదు కూరలు, వడియాలు, పెరుగు, నేతితో సహా వడ్డిస్తున్నాడు.
ఏం పద్యం! ఏం రాయలవారు! కన్నడప్రభువు తెలుగువారి సాహిత్యపు బంగారుపంటగా దొరకడం వారి పురాకృత పుణ్యవిశేషం.
ముసురు పట్టిందనడానికి " గగనము నీరుబుగ్గ కెనగా " అన్నది ఒక అందమైన ప్రయోగం. నాలుగవ పాదంలో " కూరలున్/వడియముల్/వరుగుల్/పెరుగున్/ఘృతప్లుతిన్ - యీ విరుపుల వల్ల విష్ణుచిత్తుడు చాలా పదార్థాలు వడ్డించాడని తెలుస్తున్నది.
ఇక చివరగా, రాయలవారి విషయ పరిజ్ఞానం. ఏ ఋతువులో ఏ ఆహారపదార్థాలు తింటే ఆరోగ్యానికి మంచిదో, ఏ ఋతువులో ఏవి అందుబాటులో ఉంటాయో అవి సమకూర్చుకోవాలన్న సూచన కూడా ఈ పద్యంలో ఉన్నది.
ఈ వ్యాఖ్య మీకు నచ్చితే, అబ్బ! ఎంత మంచి వ్యాఖ్య వ్రాశానని నన్ను పొగడకండి. ఈ పొగడ్తలన్నీ ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర్రావుగారికి చెందాలి. ఈ గొప్పదనమంతా తెలుగు సాహిత్య విమర్శను తారాపథంలోకి తీసుకువెళ్ళి, రసజ్ఞులతో పాటు, సామాన్య పాఠకుల మెదడుకు కూడా మేతనందిస్తున్న మహానుభావులది. మాటలు మాత్రమే నావి.
ఎందరో మహానుభావులు ......అందరికీ వందనాలు.
No comments:
Post a Comment