ఒకనాడు దీర్థోపయోగి గాని శఠుండు
నౌదల ధరియించు నభ్రగంగ
నాప్రొద్దు పొయిరాజనట్టి నిర్పేదయు
భోగించు నైశ్వర్యము లెనిమిదియు
బుష్కరాక్షుల పొంత బోని వర్షవరుండు
దేహార్థమున దాల్చు దీగబోడి
నాయుధ ప్రభ గాంచి యలగు భీరువు బూను
వాడి ముమ్మోముల వేడి యలుగు
మలినవర్తనుడును సుధాలలితమూర్తి
మించి వర్తించు మతిలేని మేదకుండు
మౌనివర్యుల జదివించు మర్రినీడ
బంచముఖువీట మేనోసరించెనేని.
తెనాలి రామకృష్ణుడు వ్రాసిన పాండురంగ మాహాత్మ్యము నందలి యీ పద్యం కూడా కాశీ క్షేత్ర మహిమను వర్ణించేదే.
సనాతన ధర్మాన్ని ఆచరించే చాలమంది జీవితం చిట్టచివరి రోజులు కాశిలో గడిపి, అక్కడ ప్రాణాలు విడవాలని కోరుకుంటారు. దానికి కాశీ క్షేత్ర మహిమే కారణం. కాశిలో మరణించిన వానికి శివుడు కుడిచెవిలో తారక మంత్రముపదేశించి శివసాయుజ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుచేత, అక్కడ అసువులు బాసిన ప్రతివాడు శివుడై భాసిస్తున్నాడు. ఆ విషయాన్నే, తెనాలికవి కవితారూపంగా చెప్పాడు.
ఒక్కరోజు కూడ తీర్థస్నానము చేయని (ఎందుకూ కొరగాని చెడు తలపు కలవాడు), తల మీద పవిత్ర గంగానదిని ధరించగలుగుతున్నాడు. ఒక్కరోజు కూడ ఇంట్లో పొయ్యి వెలిగించని నిరుపేద, అష్టైశ్వర్యాలను అనుభవించగలుగుతున్నాడు. నపుంసకుడై ఆడువారివంక కన్నెత్తి చూడలేని పేడివాడు, శరీరంలో సగభాగం స్త్రీకి ఇవ్వగల్గుతున్నాడు. అనగా, అర్థనారీశ్వరుడవుతున్నాడు. మిక్కిలి పిరికివాడు కూడ వాడిగల త్రిశూలాన్ని ధరించగలుగుతున్నాడు. చెడుప్రవర్తన కలిగినవాడు చంద్రుని మించిన అమృతమూర్తియై వెలుగొందగలుగుతున్నాడు. మతిస్థిమితం లేనివాడు, మర్రిచెట్టు నీడలో మునులకు పాఠాలు చెప్పగలుగుతున్నాడు. అనగా దక్షిణామూర్తి అవగలుగుతున్నాడు.
ఇవన్నీ ఏ మాత్రం అర్హతలు లేనివారికి యెట్లా కలుగుతున్నాయి? ఒకే ఒక్క కారణం. అంత్యకాలంలో, కాశిలో శరీరత్యాగం చేయగలిగినందులకు. అదీ కాశీ క్షేత్ర మహిమ.
No comments:
Post a Comment