దానములం దపంబులను దద్దయు బే ర్గలయట్టివారలన్
మానవనాథులన్ వినమె! మాసె దదీయ యశంబు లెల్ల నీ
మానిత కీర్తిదీప్తులు సమస్తజగంబులయందు బర్వుట
న్మేనులతోడ వా రిటులు నేర్చిరె రా నమరత్వసిద్ధికిన్.
ధర్మరాజును పరీక్షించడానికి యమధర్మరాజు సారమేయం (కుక్క) రూపంలో అతడిని అనుసరించాడు. కుక్కను కూడ తనతో పాటు స్వర్గానికి అనుమతిస్తే కానీ, తాను రథం యెక్కనన్నాడు. ఆ ధర్మబుద్ధికి సంతోషించిన యమధర్మరాజు, కొడుకుని , ఆశీర్వదించి, నిశ్చింతగా తనువుతోనే యోగమార్గంలో స్వర్గానికి వెళ్ళమని ఆదేశించాడు. ఆ సమయంలో బ్రహ్మతత్త్వరహస్యవేత్త అయిన నారదుడు అందరు వినేటట్లు యీ విధంగా అన్నాడు.
" దానాలతో, తపస్సులతో, పేరుపొంది స్వర్గానికి వెళ్ళిన ఎంతోమందిని రాజులను గురించి విన్నాము. కానీ, నీ ఉజ్జ్వలమైన కీర్తికాంతు లున్నాయి చూసావా, అవి అన్ని లోకాల్లోను వ్యాపించటం చేత, అంతకుముందున్న వారి కీర్తి అంతా మాసిపోయింది. ఆహా! నీలాగా వారు సశరీరంగా అమరత్వం పొందగలిగారా? "
ధర్మరాజు యొక్క గొప్పదనాన్ని విశదపరచే యీ పద్యం చదివిన తరువాత, నాకైతే " అయ్యో! ఇప్పటిదాక మహాభారత కావ్యమంతా పరచుకొని , తన ధర్మబుద్ధితో మన హృదయాలను ప్రక్షాళన చేసిన మహిమాన్వితుడు, మనందరినీ, యీ భూమిజీవులను, వదలి స్వర్గారోహణం చేస్తున్నాడు. ఇక మనకు ధర్మం చేప్పేదెవరు? " అనిపించింది.
ఆంధ్రమహాభారతం లోని యీ సరళమైన పద్యం మహాప్రస్థానికపర్వంలో ఉన్నది.
No comments:
Post a Comment