కమలాక్షి యిది యేమిగా దలంచితి విప్పు
డర్థ దేహంబు నీయదియ కాదె
హృదయంబు పొరువున హృదయ ముండుట లేదె
యేకీభవించిన యిరువురకును
నే భావమైన నీ హృదయంబునకు దాప
నే భంగి వచ్చి నా హృదయమునకు
నపరాధశంక యావంత యైనను లేదు
నీ చిత్తమున కెక్క నిక్కువంబు
తప్పు లేకుండ నేల నెత్తమ్మి మొగడ
విసరి వక్షఃప్రదేశంబు వ్రేటుకొంటి
కేసరంబులరజము పుష్పాసవంబు
నెఱసె నిది చూడు కన్నుల నీరు గ్రమ్మె.
నంది తిమ్మన గారి పారిజాతాపహరణము కావ్యములో, కోపగృహంలో నున్న సత్యభామ, అనునయించడానికి వచ్చిన కృష్ణుని, ఆమె వామపాదంతో తొలగద్రోయడము చదివాము. శ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము, చిఱుతొండనంబి కథలో, ఇంకొక చక్కని సన్నివేశాన్ని మనము చూస్తాము.
చిఱుతొండనంబి గొప్ప శివభక్తుడు. అతని ఇంటికి అతిథిగా వచ్చిన జంగము, శివాభిషేకము కోసం తూమెడు చెఱకురసము తెమ్మంటాడు. తూమెడు చెఱకుగడలు కొని, మోపును పైకెత్తటానికి కష్టపడుతున్న చిఱుతొండనంబికి శివుడు మారువేషంలో వచ్చి సహాయపడతాడు. కానీ, అదే సమయంలో, కైలాసంలో అప్సరసల నాట్యం తిలకిస్తున్న శివుని మేను చెమర్చడము చూసింది పార్వతి. ఈర్ష్యతో ఆమె, తన చేతిలో నున్న తామర పువ్వుతో శివుని మొత్తుతుంది. శివుని కంటిలో తామరపువ్వు పుప్పొడి పడి కంట్లో నీరు వస్తుంది. ఇదీ సన్నివేశం.
ఈ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని, అర్థనారీశ్వరుడైన శివుడు యీ విధంగా చెబుతున్నాడు.
" పార్వతీ! ఇది ఏమి తప్పు అని నీవు తలుస్తున్నావు? నా శరీరంలో సగభాగం నీవే కదా! అందువల్ల, నా హృదయం ప్రక్కనే నీ హృదయముండి, ఏకత్వము వహించిన మన ఇద్దరకు, నీ హృదయంలో కలిగిన ఏ భావమైనా, నా హృదయాన్ని తాకుతుంది. కావున, ఆవగింజంత అపరాధ భావమైనా నీ హృదయంలో నుండనక్కర లేదు. తప్పు చేయని, నన్ను వక్షఃప్రదేశంలో యెట్లాకొట్టావో చూడు. నా కళ్ళలో పుప్పొడి పడి నీళ్ళు కూడా వచ్చాయి. "
ఇది ఆదిదంపతుల మధ్య జరిగిన చమత్కారమైన సంభాషణ. లోకంలో యిది చాలా సహజము. అందువల్లనే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు " రసము పుట్టింపగ వ్యవహారము నెఱుంగ/ జనును లోకమ్ము వీడి రసమ్ము లేదు. " అన్నారు.
ఏమి చేసినా, లోకవ్యవహారాన్ని తెలిసి చేస్తారు మహాకవులు. కవిసార్వభౌములు అదే చేశారు యీ సన్నివేశంలో.
No comments:
Post a Comment