శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేక స్తంభకు, కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
ఇది శ్రీమదాంధ్ర మహాభాగవతము నందలి మొదటి పద్యము. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశములలో ఏదో ఒకటి మొట్టమొదటగా ఉండాలనే పెద్దల నిర్ణయంతో, నమస్కారము, వస్తునిర్దేశముల మేళవింపుగా యీ పద్య రచన సాగింది.
పలికించెడివాడు రామభద్రుడు అని చెప్పిన పోతన, కైవల్యము, అనగా మోక్షము, కోసం యీ భాగవతాన్ని వ్రాస్తున్నానన్నాడు. ఈ పద్యంలో ఆరు దీర్ఘ సమాసాలున్నాయి. అవి, లోకరక్షైకారంభకు (సర్వలోకాలను సంరక్షించే వాడిని), భక్తపాలనకళా సంరంభకున్ (భక్తులను కాపాడటంలో నేర్పరియైన వానిని), దానవోద్రేకస్తంభకు (రాక్షసుల గర్వాన్ని అణచేవాడిని), కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు (విలాసంగా చూసే చూపుతో సమస్త బ్రహ్మాండాలను సృష్టించిన వానిని), మహానందాంగనా డింభకున్ (నందుని కొడుకును, అమితమైన ఆనందాన్ని కలిగించేవాడిని). కైవల్యప్రాప్తి కలిగించే దేవదేవుడిని స్మరిస్తున్నాను అని పోతన మహాభాగవత రచనకు ఉపక్రమించాడు.
ఈ పద్యములో ద్వాదశ స్కంధముల భాగవతములోని వస్తు నిర్దేశము జరిగింది. సమాసాంతములో నున్న ఆరంభకున్, సంరంభకున్, స్తంభకున్, కుంభకున్, డింభకున్ అనే అంత్యప్రాసలు, బిందుపూర్వక భకారంతో మరల మరల రావడం వల్ల, శ్రవణానందం కలిగిస్తూ, పద్యానికి ఒక వింత సొగసును, గాంభీర్యాన్ని ప్రసాదిస్తున్నది.
No comments:
Post a Comment