పాదపద్మములందు బ్రభవించునప్పుడు
ప్రత్యగ్రయావకద్రవము చెలువు
కటిమండలంబుపై గనుపట్టునప్పుడు
కనకకంచీదామకంబు డాలు
వలుదచన్నులమీద మొలతెంచునప్పుడు
కాశ్మీరజాంగరాగంబు పొలుపు
సీమంతపదమున జిగురొత్తునప్పుడు
రమణీయసిందూరరజము సొబగు
ప్రోదిసేయుచు భగ్గున భుజగహారు
రాణివాసంబు విగ్రహమునందు
రవులుకొని మండె నాస్థానరంగభూమి
నధిక రోషోత్థితంబు యోగానలంబు.
యాగశాలలో, తన తండ్రి దక్షుడు చేసిన శివనింద భరించలేని, దాక్షాయణి, ఆ పేరుతో మనడానికి ఇష్టపడక, కాలిబొట్టనవ్రేలుని నేలకు రాచి, యోగాగ్నిని సృష్టించుకొని, అందులో తన శరీరాన్ని దగ్ధం చేసుకొన్నది. ఈ సన్నివేశాన్ని శ్రీనాథ కవిసార్వభౌముడు ఎంతో కవితాత్మకంగా, అద్భుతంగా, కాశీఖండము సప్తమాశ్వాసములో వర్ణించాడు.
సతీదేవి పాదపద్మముల దగ్గర ఉద్భవించినప్పుడు, ఆ యోగాగ్ని, ఆమె కాళ్ళకు రాసిన యెఱ్ఱని లత్తుకద్రవం లాగా ఉన్నదట. అది, కటిస్థలం వద్ద, ఆమె ధరించిన బంగారు మొలతాడు లాగా ఉన్నదట. వక్షస్థలం దగ్గర, ఆమె అలదుకొన్న కాశ్మీరచందనపు పూత లాగా ఉన్నదట. శిరోభాగంలో, పాపట దగ్గర, సిందూరం పొడి లాగా ఉన్నదట.
సతీదేవి పాదాల వద్ద పుట్టిన యోగాగ్ని, లత్తుకద్రవంలాగా వ్యాపించి, పై పైకి ఎగబ్రాకి, శిరస్సు వద్ద సిందూరపు పొడిలాగా చెలువొంది, పోగుచేసుకొని, ఆమె దివ్యమైన శరీరమంతా రగులుకొని, అధికరోషావేశంతో మండిపోయింది, అనడం ఔచిత్యభరితంగా ఉన్నది. బహుశా, ఒళ్ళు మండి పోయింది అనే నానుడి ఇక్కడనుంచి వచ్చిందేమో!
No comments:
Post a Comment