సకలాగమాంత వాసనలు గాంచి విముక్త కాంచనం బను మాధుకరకులంబు
వర్ణిత్వమున దృఢావ్యాప్తిసమ్యమములై శౌరి బేర్కొను శుకసంతతులును
గన్న పెంచినవారి గలయక మాధవార్పితసూక్తి మను వనప్రియచయంబు
పద్మాసనాభ్యాస పారవశ్యమున బ్రహ్మాధీనగతులైన హంసతతులు
పుష్పఫలపత్రజలమాత్రముల శరీరయాత్ర గడపుచు సన్మార్గ మధిగమించి
యెసగునివి యెల్ల నీ కేల యెగ్గొనర్చు వనిత యావంత యావంత వలదమ్మ.
వసుచరిత్రములో ఏ పద్యాన్ని తీసుకొన్నా వదల బుద్ధి గాదు. నా వంటి అపండితుడయినా, కొంచెము శ్రమించి, పెద్దలు వ్రాసిన టీకాతాత్పర్యసహిత వ్యాఖ్యలను అర్థం చేసుకొంటే, ఆ పద్య మాధుర్యానికి కట్టుబడిపోవలసినదే. అటువంటిదే యీ పద్యం కూడా.
మన్మథతాపంతో వనంలో వంటరిగా తిరుగుతున్న గిరికను పలువిధాలుగా అనునయించారు చెలికత్తెలు. భిక్షుకులు లేక సన్యాసులు/తుమ్మెదలు (మాధుకరకులంబు), అస్ఖలిత బ్రహ్మచారులు/చిలుకలు (శుకసంతతులు), వానప్రస్థులు/కోయిలలు (వనప్రియచయంబు), యోగులు/హంసలు (బ్రహ్మాధీనగతులు), సన్మార్గంలో చరించేవారు కావడం వల్ల, తమ ప్రియసఖికి ఆవగింజంత అపకారం చేయవని వారు చెబుతున్నారు. దానిని అర్థద్వయంతో, రామరాజభూషణుడు యెంతో చక్కగా వర్ణించాడు.
ముందుగా వర్ణాశ్రమధర్మాలు పాలింపబడిన మానవసమాజం పరంగా అర్థం చెప్పుకుందాము.
సమస్త వేదాంత సారాన్ని వంటబట్టించుకొన్న భిక్షుకులు, ఇంద్రియ సంయమము , దృఢమైన మనస్సు కలిగిన, శుకమహర్షి వంటి అస్ఖలిత బ్రహ్మచారులు, తల్లిదండ్రులు మొదలగువారికి దూరంగా, అడవిలో వాసుదేవుని స్మరణతో వానప్రస్థ జీవితం గడుపున్న వారు, పద్మాసనాభ్యాస పారవశ్యంతో బ్రహ్మాత్మ్యైక సంధానాన్ని పొందుతున్న యోగులు, తమ ప్రియసఖికి యే మాత్రం అపకారం చేయరని చెలికత్తెలు గిరికను ఓదారుస్తున్నారు.
ఇక మన్మథునిభృత్యుల పరంగా చెప్పిన రెండవ అర్థాన్ని పరిశీలిద్దాము.
అగమాంతమములు అంటే లతాంతములు, పుష్పములు. వాటి సువాసనల్ని పొందేవి తుమ్మెదలు. కానీ, ఆ తుమ్మెదలు కాంచనము, అనగా, సంపంగి పువ్వు జోలికి వెళ్ళవు. అటువంటి విముక్తకాంచనం బగు మాధుకరకులంబు ( సంపంగి పూలను విడిచిపెట్టిన తుమ్మెదల గుంపు) గిరిక జోలికి పోవు. అక్షరములను పలికే తీరుచేత, రామ రామ రామ అని (రాము రాము రాము) పలికే చిలుకల గుంపు (శుకసంతతులు) కూడా ఏమీ చేయవు. తాము కన్న కోయిలలు, పెంచిన కాకులను కలవకుండా, వసంత ఋతువునకు (మాధవార్పితసూక్తి) తగిన మధురమైన కంఠస్వరంతో అడవిలో ఉంటున్న కోకిలలు (వనప్రియచయంబు) కూడా యేమీ చేయవు. పద్మములలో కూర్చుండడం చేత పరవశత్వం చెందుతున్న (పద్మాసనాభ్యాస పారవశ్యమునన్) బ్రహ్మకు వాహనమై మందగతులైన (బ్రహ్మాధీనగతులైన), హంసలు కూడా ఏమీ చేయవు.
పై రెండు అర్థాలను సమన్వయం చేస్తూ, తేటగీతిలో " పుష్పఫలపత్రజలమాత్రముల శరీరయాత్ర గడపుచు " అనేదానిలో, క్రమాలంకారము ఉన్నది. ఆందుచేత, భిక్షుకత్వాన్ని అవలంబిస్తూ సన్యాసులు ఉదరపోషణను, తుమ్మెదలు పూవుల సువాసనను మాత్రము, బ్రహ్మచారులు, చిలుకలు పండ్లను మాత్రము, వానప్రస్థులు, కోయిలలు, ఆకులను మాత్రము, పరమహంసలు, హంసలు, జలము మాత్రము, సేవిస్తూ, సన్మార్గంలో ఉన్నారు. అటువంటివారు/అటువంటివి, తమ ప్రియసఖికి ఆవగింజంత అపకారం చేయరని, అందువల్ల, విచారించవలసిన పనిలేదని చెలికత్తెలు గిరికను అనునయించారు.
వసుచరిత్రము తృతీయాశ్వాసములో నున్న యీ పద్యము వంటివి కావ్యం మొత్తంలో కొల్లలు.
No comments:
Post a Comment