పక్షము పెంపునం గుసుమబాణుని మీదనె వ్రాలె దేవతా
ధ్యక్షుని వేయికన్నులును దక్కిన వేల్పుల నుజ్జగించి సూ
క్ష్మేక్షిక జూడ గార్యగతి యిట్టిదయౌ ప్రభువుల్ ప్రయోజనా
పేక్ష నొకప్పు డాశ్రితుల కీరె సమంచిత గౌరవోన్నతుల్.
తారకాసురుని సంహరించడానికి శివపార్వతులకు కుమారుడు పుట్టవలసిన ఆవశ్యకతను గుర్తించిన దేవేంద్రుడు, శివ తపోభంగము చేయించి, పార్వతితో కళ్యాణము జరిగేటట్లు చూడడము కోసము, మన్మథుని తన కొలువుకూటానికి పిలిపించాడు. ఆ కారణంగా, తక్కిన దేవతల నందరినీ ప్రక్కనబెట్టి, మన్మథుని అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవడము చేత, ఇంద్రుని వేయికళ్ళూ అతడి మీదే పడ్డాయి. సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే, పనులను సాధించుకొనవలసిన తీరు ఇదే కదా! పాలకులు, కార్యసాధనను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కప్పుడు తమ మీద ఆధారపడ్డవారికి కూడా అధికమైన గౌరవాన్ని, స్థానాన్ని కల్పిస్తారు.
ఈ పద్యం చివరి చరణంలోని సందేశం లోక మర్యాద ననుసరించి ఉంది.
ఈ పద్యం శ్రీనాథుని హరవిలాసం కావ్యం తృతీయాశ్వాసంలోని కుమారసంభవ ఘట్టంలో ఉంది.
No comments:
Post a Comment