కమనీయ భూమి భాగములు లేకున్నవే
పడియుండుటకు దూదిపఱుపులేల?
సహజంబులగు కరాంజలులు లేకున్నవే
భోజనభాజన పుంజమేల?
వల్కలాశాజినావళులు లేకున్నవే
కట్ట దుకూల సంఘాతమేల?
కొనకొని వసియింప గుహలు లేకున్నవే
ప్రాసాదసౌధాది పటలమేల?
ఫలరసాదులు గురియవే పాదపములు
స్వాదుజలముల నుండవే సకల నదులు
పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు
ధనమదాంధుల కొలువేల తాపసులకు?
శ్రీమదాంధ్రమహాభాగవతం ద్వితీయస్కంధంలోని యీ పద్యం, సంసారంలో, సౌఖ్యాల రూపంలో మనం తెచ్చిపెట్టుకొన్న బంధాలను, ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలను, అరటిపండు వొలిచిపెట్టినట్లు చెబుతూ, తద్వారా, కర్మజీవికి, యోగికి ఉండే తేడాను విశదపరుస్తున్నది. నిరాడంబరంగా బ్రతకడంలో ఉన్న ఆనందం, డాంబికంగా బ్రతకడంలో లేదని, " ధనమదాంధుల కొలువేల తాపసులకు", అని కుండబద్దలు కొట్టి చెబుతున్నది.
శృంగి శాపకారణంగా, తక్షకుని విషంతో, ఏడురోజులలో మరణం సంప్రాప్తమౌతుందని తెలుసుకొన్న పరీక్షిత్తునకు, శ్రీశుకులు, భక్తిజ్ఞానవైరాగ్యాలను బోధిస్తున్న సందర్భమిది.
మనిషికి కనీస అవసరాలు, కూడు, గుడ్డ, నీరు, నిద్రించడానికి కొంచెం ప్రదేశం. జానెడు పొట్ట నింపుఓడానికి పండ్లు, కట్టుకోడానికి నారబట్టలు, త్రాగడానికి తియ్యని నీళ్ళు, పడుకోడానికి కొండగుహలు ప్రకృతి మనకిచ్చింది. వాటితో తృప్తి పడక, పంచభక్ష్యపరమాన్నాలు, పట్టుపీతాంబరాలు, వివిధరకాల సుగంధ శీతల పానీయాలు, హంసతూలికాతల్పాలు మనం కోరుకున్నవి. కట్టుకొయ్య నుండి విప్పుకొనే ప్రయత్నంలో, దాని చుట్టు తిరుగుతూ, ఇంకా రెండుచుట్లు యెక్కువ వేసుకొనే పశువు తీరులాగా ఉంది ఇది. జ్ఞాని ఉన్నదానితో సంతృప్తి పడతాడు. ఏ అమ్మయినా ఇంత పెట్టకపోతుందా, తన జీవితం వెళ్ళకపోతుందా అనుకుంటాడు. కర్మజీవి, అవసరంలేనిదానికి కూడా వెంపర్లాడతాడు. ఇంతే తేడా!
ఇంత మంచి పద్యం ఎవరు వ్రాయగలరు? అందరినోళ్ళలో, హాలికుడిగా, సహజకవిగా, పరమభక్తాగ్రేసరుడిగా పెరుపొందిన పోతన్న తప్ప.
No comments:
Post a Comment