మనుజులు పుణ్యపాపములు మానక యి ట్లొనరించుచుం దుదిం
దనువు దొఱంగి పోవునెడ దప్పదు నీడయవోలె గర్మమున్
వెనుకన యేగి భూరిసుఖవిస్మృతియుం బటు దుఃఖదైన్యమున్
దనుకగ జేయు; గ్రమ్మఱగ దాన యొనర్చు భవంబు దేహికిన్.
వనవాసంలో నున్న పాండవుల వద్దకు మార్కండేయ మహాముని వస్తాడు. అతనిని, ధర్మరాజు కర్మఫలాన్ని గూర్చి అడుగుతాడు. మానవుడు ఈ లోకంలో చేసిన కర్మఫలాన్ని ఇక్కడే అనుభవిస్తాడా, పరలోకంలో అనుభవిస్తాడా, లేక ఇహ పర లోకాల్లో అనుభవిస్తాడా? శరీరనాశనంతో పాటు కర్మ నాశనం కూడా జరుగుతుందా? ఇవన్నీ ధర్మరాజు ధర్మసందేహాలు. దానికి, మార్కండేయ మహర్షి తగువిధంగా సమాధానం చెబుతాడు.
భవము అంటే పుట్టుక. దేహి అనగా దేహము ధరించిన వాడు. మానవుడు, తాను చేసిన పాపపుణ్యాల కారణంగా, 'పునరపి జననం పునరపి మరణం' అని, జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటాడు. ఈ రకంగా, పాపపుణ్యాలు విడవకుండా చేయడం వల్ల, చనిపోయిన తరువాత కూడా, వాని కర్మఫలం వానిని నీడవలె వెంటాడుతుంది. గతజన్మల లోని సౌఖ్యానుభూతిని మరపుకు తెచ్చి, దైన్యము, తద్వారా, దుఃఖము కలిగేటట్లు చేస్తుంది. ఈ దుఃఖమే మరల మరల పుట్టడానికి దారితీస్తుంది.
కర్మఫలాన్ని గురించి ధర్మరాజు లేవనెత్తిన సందేహాలకు మార్కండేయ మహర్షి చేసిన యీ నివృత్తి, ఎఱ్ఱన పూరించిన ఆంధ్రమహాభారతము అరణ్యపర్వశేషంలో ఉన్నది.
No comments:
Post a Comment