గురువిద్వేషికి విప్రయోగిహరణక్రూరుండు మారుండు దా
బరమాప్తుండు తదీయభృత్యులు దలంపం గాంచనస్తేయత
త్పర గంధానిలము ల్మహామధుపము ల్దన్మైత్రి గాంచెం బిక
స్వరముం బంచమశబ్ద మిందుకు సుదృక్జాలంబు రాజెల్లునే.
వసురాజును చూసిన తరువాత, మన్మథవికారానికి గురియైన గిరిక వంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది.. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన చెలికత్తెలు, ఆమెను అనునయించడం మొదలుపెడతారు. ఆ సందర్భము లోనిది యీ పద్యము.
గురుపత్ని అయిన తారతో సంయోగము చేత, చంద్రుడు గురువిద్వేషి. విప్రయోగమనగా విరహము. దానిని కలిగినవాడు విప్రయోగి. తదీయహరణమందు క్రూరుడైనవాడు మన్మథుడు. అటువంటి మన్మథుడు చంద్రునికి మిక్కిలి ఆప్తుడు. ఇక మన్మథుని సేవకులందామా! కాంచనస్తేయ తత్పర గంథానిలములు, మహామధుపములు. కాంచనమనగా సంపంగిపూవు. దానిని రాల్చేది మలయమారుతము. మహామధుపములు అనగా తుమ్మెదలు. మన్మథునికి సేవకులు మలయమారుతము, తుమ్మెదలు. మన్మథతాపము కలిగించే వాటిలో పికస్వరం ఒకటి. అడవిలో కోకిలస్వరము వినబడుతుంది. పై నలుగురికీ తోడయింది కనుక, కోకిల పంచమమహాపాతకి అయింది.
చంద్రుడు, మన్మథుడు, మలయమారుతము, తుమ్మెదలు, కోకిల పంచమహాపాతకులు. వారున్న చోటికి వివేకవంతులైన స్త్రీలు వంటరిగా వెళ్తారా? వెళ్ళకూడదని భావము.
వసుచరిత్రములో చాలా పద్యాలు శ్లేషతో కూడి ఉంటాయి. తృతీయాశ్వాసములోని యీ పద్యం కూడా శ్లేషమూలం కలిగినది.
No comments:
Post a Comment