పాలిండ్లు గదలంగ బసపు బయ్యెద వీచు
నచలాధిపతి కూర్మి యాడుబిడ్డ
థూత్కార మొనరించు తొండంబు ముక్కున
శీకరాసారంబు జిలుక డుంఠి
ప్రత్యక్షమై వచ్చి భాగీరథీగంగ
మృదులహస్తము సాచి మేను నివురు
బ్రమథోత్తముడు భృంగి భయరక్షణార్థమై
ఫాలాగ్రమున దీర్చు భసితరేఖ
దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి ద్రెళ్ళి
పెద్దనిద్రకు మ్రాగన్ను పెట్టువేళ
పంచజనులకు దారక బ్రహ్మవిద్య
అభవు డుపదేశ మొనరించు నపుడు కాశి.
శ్రీనాథ కవిసార్వభౌముడు రచించిన కాశీఖండము, ద్వితీయాశ్వాసములోని యీ పద్యము, కాశీ క్షేత్ర మహిమను తెలియజేస్తుంది.
జీవితం చివరి రోజులలో, కాశీ క్షేత్రములో గడిపి, అక్కడ మరణం సంప్రాప్తిస్తే, శివసాయుజ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. దానికి ప్రమాణంగా నిలుస్తుందీ పద్యము.
అంత్యఘడియలలో నున్న జీవుని శరీరానికి హాయి కలిగించేటటుగా, పార్వతీదేవి, తన పసుపు పచ్చని కొంగుతో గాలి వీస్తుందట. అమ్మలగన్న యమ్మ కదా ఆ జగజ్జనని. ఇక డుంఠి వినాయకుడైతే, చల్లని నీరు తుండము నిండా నింపుకొని, శరీరమంతా చల్లుతాడట. పవిత్రమయిన గంగమ్మ తల్లి, తన మంజుల తరంగాలతో వళ్ళంతా నిమురుతుందట. ప్రమథగణాల్లో శ్రేష్ఠుడైన భృంగి, మృత్యుభయం పోగొట్టడానికి, ఫాలభాగంలో విభూతిరేఖలు దిద్దుతాడట. అప్పుడు, శివుడు, జీవుని కుడిచెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడట.
కాశీ క్షేత్రంలో మరణించిన వారికి పునర్జన్మ లేదు. ఎందుకంటే, తారకమంత్రోపదేశం చేసినది అభవుడు, పుట్టుక లేనివాడు. భవవిముక్తి ఆ దేవుని చేతిలోనిదే. పునర్జన్మ లేని మోక్షప్రాప్తి కోసం అవిముక్త క్షేత్రంలో గడపడము చాలా విశిష్టమైనదిగా, సుకృతఫలంగా భావిస్తారు సనాతనధర్మావలంబులు.
No comments:
Post a Comment