కలశ పాథోరాశి గర్భవీచిమతల్లి
కడుపార నెవ్వాని గన్నతల్లి
యనలాక్షు ఘన జటావనవాటి కెవ్వాడు
వన్నెవెట్టు ననావర్తంపుబువ్వు
సకల దైవత బుబుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు
నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొరజోడు రేవెలుంగు.
ఈ సీస పద్యము చంద్రునికి సంబంధించినది. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము అవతారిక లోనిది. చంద్రుని పరంగా ఇందులో వాడిన విశేషణాలను అన్వయించుకుంటే, పద్యము చక్కగా అర్థమవుతుంది.
కలశపాథోరాశి అంటే పాలసముద్రము. దానికా పేరు ఎందుకు వచ్చిందంటే, క్షీరసాగరాన్ని చిలికినప్పుడు పుట్టిన అమృతాన్ని నింపడానికి, విశ్వకర్మ ఒక కలశాన్ని చేశాడట. కలశమునకు సంబంధించినది కావున పాలసముద్రము కలశపాథోరాశి. గర్భవీచిమతల్లి అంటే పాలసముద్రము నడిమినున్న మేలితరగ. ఆ మేలితరగలో పుట్టినవాడు చంద్రుడు. అంటే, క్షీరసాగర మథనంలో ఉద్భవించినవాడు చంద్రుడు.
అనావర్తంపు పువ్వు అంటే ఋతుసంధము లేని పువ్వు. సర్వకాలముల యందుండునది. ఈ పువ్వు, శివుని గుబురుగానున్న జడలకు వన్నె తెచ్చేది. చంద్రుడు శివుని శిరోభూషణము.
బుబుక్ష అంటే ఆకలి. అందరి దేవతకు ఆకలి తీర్చే మెట్ట పంటట. మెట్టభూమి, వర్శమున్నా లేకున్నా పండే భూమి. చంద్రుడు దేవతలకు ఆహారము.
కటికచీకటి తిండి అనగా, గాఢాంధకారాన్ని, కరముల గిలిగింతచే, కిరణములచే పోగొట్టే, కలువల చెలికాడు. చంద్రోదయంతో కలువలు వికసిస్తాయి.
చంద్రుడు విష్ణుమూర్తి మఱది. శ్రీమహాలక్ష్మి, చంద్రుడు, ఇద్దరూ పాలసముద్రములో పుట్టినవారే.
చంద్రుడు పదహారు కళలకు నెలలు. అశ్విని మొదలగు నక్షత్రాలకు రాజు. చల్లని కాంతిని ప్రసాదించేవాడు. అందగాడైన మన్మథునికి మేనమామ. పగటి వెలుగుల రాజు, సూర్యునకు జతగాడు యీ రాతిరి వెలుగు అయిన చంద్రుడు.
చంద్రుని వర్ణనకు సంబంధించిన యీ పద్యము అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము అవతారిక లోనిది. చంద్రుని పరంగా ఇందులో వాడిన విశేషణాలను అన్వయించుకుంటే, పద్యము చక్కగా అర్థమవుతుంది.
No comments:
Post a Comment