సారస కైరవంబులకు జంద్రదినేంద్ర విరోధ మంచకుం
బారము లేని మందగతి భారము దెమ్మరకున్ ఫణిగ్రహ
క్రూరవిఘాత మంగజునకుం గడతేరని భీమవీక్షణాం
గారకవైర మింత తలకం బని లేదు మనోజుధాటికిన్.
పద్మములకు (సారసములు), కలువలకు (కైరవములు), చంద్రుడు, సూర్యుడు విరోధులు. చంద్రోదయంతో పద్మాలు ముడుచుకుంటాయి. సూర్యోదయంతో కలువలు ముడుచుకుంటాయి. హంస మందయానము గలది. అంటే, మెల్లగా నడుస్తుంది. కానీ, ఆ నడక అందంగా ఉంటుంది. మందుడు అనగా శనిగ్రహము. సూర్యమండలంలో శనిగ్రహం చాలా మెల్లగా తిరిగే గ్రహము. కానీ, హంస శనిగ్రహాన్ని మించిపోలేదు. మలయమారుతమునకు రాహువు విరోధి. రాహువు సర్పము. పాము వాయువును భక్షిస్తుంది. ఇక మన్మథునకు ఉగ్రదృష్టి కలిగిన (అంగారకుడు) విరోధి. భీమవీక్షణము శివుని కంటిమంటలను గుర్తు చేస్తుంది. అందువలన, మన్మథుని పరివారము వల్ల భయపడవలసిన అవసరము లేదని, మన్మథతాపానికి గురయిన గిరికను చెలికత్తెలు అనునయిస్తున్నారు.
వసుచరిత్రము తృతీయాశ్వాసములో నున్న యీ పద్యములో నున్న అలంకార విశేషాన్ని విరోధాభాసము అంటారు.
No comments:
Post a Comment