స్థితచిత్తున్ సుఖనిద్ర పొందునటె? వచ్చీరాని కన్మూతలై
యతడున్ నిద్దుర పోయినట్లుగను బోనట్లౌచు నుండన్ సమ
ర్పితధీవృత్తి జలించె నాహవమహావృత్తంబె ధారాగతిన్.
అపుడు ప్రహస్తుడై పొలిచి యాశరనాయక ! యింతదవ్వు నే
రుపు బచరించినా వకట ! రుద్రుడు వచ్చినయట్టి వాకిటం
గపులను తెచ్చినావు బహుకంపితచిత్తముతోడ నెట్టివే
లుపులును రాని వాకిటను లోకువయైరి సమస్తదానవుల్.
చెడ గొండంతటి నిన్ను గుజ్జుగను జేసెన్ వాడుగో ! ఆ మను
ష్యుడు గోరంతటివాడు కొండయయి పొల్చున్, గామవృత్తంబు నే
ర్పెడి యీ త్రిప్పట వేడొ సజ్జనుడు నేర్చెన్ నేడు పాలింపగా
నొడయం డింద్రియపంచకంబునను గామోహాళి దాసేరుడై.
ఉప్పు న్నీయది తించునుంటిమని నీ యుద్ధాలలో జత్తు మో
యప్పా ! జీవుడు సర్వకాలము గతప్రాణుండు కానోపడీ
యప్పుం బోలిన జీవితంబునకు మా ప్రాణంబు లర్పించి నీ
యప్పుం దీర్చెద మింత దృప్తిపడు, దైత్యానీకినీ ప్రాజితా!
రామలక్ష్మణులు ఇంద్రజిత్తు పన్నిన నాగాస్త్రం నుంచి విముక్తు లవటంతో, రావణునిలో మొలకెత్తిన సంశయ బీజాలు వేళ్ళూనటం మొదలుపెట్టాయి. మనశ్శాంతి కోసం మండోదరి సౌధానికి వచ్చినా, ఆ రాత్రంతా రావణుడికి నిద్ర పట్టలేదు.
" కొంచెమన్నా నిద్రొస్తుందేమోనని ఆశించాడు రావణుడు. మనస్సు మనస్సులో లేనివాడికి సుఖనిద్ర పడుతుందా? కళ్ళు మూతలు పడీ పడనట్లుంటే, నిద్ర కూడా వచ్చీ రానట్లుగా ఉంది. కళ్ళముందు యుద్ధ విశేషాలే కనపడటం మొదలుపెట్టాయి.
వచ్చీరాని ఆ నిద్రలో ప్రహస్తుడొచ్చి యీ విధంగా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.
రాక్షసేశ్వరా ! ఏదో ఇంతకాలం నేర్పుగా నెట్టుకొచ్చావు. అయ్యో ! శంకరుడు అడుగుపెట్టిన వాకిట్లో కోతులను తీసుకువచ్చి కూచోపెట్టావు కదయ్యా ! దేవతలు కూడా భయంతో వణికిపోయే నీ వాకిట్లోనే ఇప్పుడు యీ దైత్యసమూహ మంతా లోకువై పోయింది గదా !
అరరే ! కొండంతటి వాడిని నిన్ను మరిగుజ్జును చేశాడు కదా ! ఇప్పుడు నాకు గోరంత ఆ మనిషి కొండంతగా కనిపిస్తున్నాడు. కామవశుడైనవాడికి యీ విధమైన తిరగబడిన పరిస్థితి, అనగా, అల్పత్వం దాపురిస్తుంది. ఇప్పుడు యీ తిరగబడిన పరిస్థితిని ఔన్నత్యం రూపంలో, యీ సజ్జనుడు సాధించాడు. కామానికి దాసుడవనివాడు పంచేంద్రియ వ్యాపారాలకు కట్టుపడడు.
ఏం చేస్తాం ! నీ ఉప్పు తింటున్నందుకు నీవు తెచ్చిపెట్టిన యీ యుద్ధాలలో చస్తాము. జీవుడు ఎప్పుడుపడితే అప్పుడు ప్రాణాలు కోల్పోడు. ఋణానుబంధంతో కూడిన మా జీవితాలను నీకు సమర్పణ చేసి, నీ అప్పు తీరుస్తున్నామని తృప్తిపడు. అంతే. "
ఈ పద్యాలలో రాక్షసవీరులు తనను నిందిస్తున్నాట్లుగా రావణుడి మనస్సుకి అనిపించింది. ప్రహస్తుడు " దైత్యానీకినీ ప్రాజితా ! " అనటంలో, తమ మంచిచెడ్డలు చూసుకొని తమను నడిపించవలసినవాడు కామానికి వశుడై సర్వదానవవంశ వినాశనానికి కారణమౌతున్నాడనే ఎత్తిపొడుపు నర్మగర్భంగా ఉంది.
రావణుడి యొక్క చెదిరిన మనస్సును పట్టి చూపే యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment