నట్టిది యిది, నేను సామి పొగటెక్కము పెన్దుముదారు సాకిరై
పొదలఁగఁ బెండ్లియాడితిమి, మోహన రూపుఁడు రాఘవుండు నా
పద యిది దాఁటినన్ ద్రిదశవంద్యున కాహుతి నౌదు నగ్నికిన్.
హ్రద రూపంబున నేర్పరించి చితి నే నగ్ని ప్రవేశంబు సే
సెద, నీ మ్రొక్కును మ్రొక్కెదన్ హుతవహా ! శ్రీరామచంద్రుండు నా
యెదలో నుండిన దీపమారమికి నీ వీ కోర్కి పాలించినన్
మదకుంభీనస మూర్తి లక్ష్మణునకున్ మన్నించినం బ్రాణముల్.
ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగపాశబద్ధులను చేశాడు. కుమారుని నోట యీ వార్త విన్న రావణుడు, సీత వద్దకు వెళ్ళి, రామలక్ష్మణులు అసువులు బాశారని, అందువల్ల వారిని మరచిపొమ్మని చెప్పాడు. కావాలంటే, సీత పక్షాన మాట్లాడే త్రిజటను పంపి తెలుసుకొనమన్నాడు. సంఘటనాస్థలానికి వెళ్ళి తిరిగివచ్చిన త్రిజట, రామలక్ష్మణులు స్పృహ లేకుండా పడివున్నారని, కానీ, వారి ముఖాలు మాత్రం పున్నమి నాటి చంద్రబింబం లాగా వెలిగిపోతున్నాయని చెప్పింది. త్రిజట మాటలతో ఊరడిల్లిన సీత, ఆమెతో యీ విధంగా అన్నది.
" ఇంతవరకు ఎవరూ మ్రొక్కని మ్రొక్కు మ్రొక్కుకుంటాను. నేను, స్వామి అగ్నిసాక్షిగా పెండ్లి చేసుకొన్నాము. మోహనరూపుడైన రామచంద్రుడు యీ ఆపద నుంచి గట్టెక్కితే, నేను దేవతల చేత సహితం పూజింపబడే అగ్నికి ఆహుతి అవుతాను.
ఓ అగ్నిదేవా ! నీటిమడుగు లాగా వెడల్పుగా చితి నేర్పాటుచేసి నేను అగ్ని ప్రవేశం చేస్తానని మ్రొక్కుకుంటున్నాను. నా హృదయం లోని దీపమైన శ్రీరామచంద్రుడికి, కోపంతో అగ్నిజ్వాలలు కురిపించే మహసర్పము వంటి లక్ష్మణుడికి ఆపద కలుగకుండా కాపాడితే, నేను చెప్పిన మ్రొక్కు చెల్లించుకుంటాను. "
శ్రీరామచంద్రుడు సీతకే కాదు, " సర్వాసు ప్రాంగణ ముగ్ధదీపిక " అని పినతల్లి కైకేయి మాట. ఇక లక్ష్మణుడు సాక్షాత్తు ఆదిశేషువు అవతారం.
వాల్మీకి రామాయణంలో ఎన్నో చిక్కుముడు లున్నాయి. వాల్మీకి హృదయాన్ని అర్థం చేసుకొన్న విశ్వనాథ వంటి రామాయణ భాష్యకారులు ఆ చిక్కుముడులకు సహేతుకతను కల్పించారు. అటువంటిదే, సీత త్రిజటతో చెప్పిన యీ మ్రొక్కు సంగతి. రావణ వధానంతరం అగ్ని ప్రవేశం చేసిన సీత చర్యకు ఒక చక్కని హేతువును కల్పించినది సీత మ్రొక్కుకు సంబంధించిన యీ సన్నివేశం.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.
No comments:
Post a Comment