సంతును గల్గు చానకును జక్కని నీయటువంటి బిడ్డయున్
గంతుని వంటివాఁడును జగత్రయపాలన పొంటె ఱేడునున్
మంతిరి కాఁగలట్టిఁడు కుమారుఁడు కలిగిన వేయిదుఃఖముల్
పినతల్లి కైకేయి కోరిక మేరకు, వనవాసానికి ఉద్యుక్తుడైన రాముడు, తల్లి కౌసల్య దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెప్పాడు. దుఃఖంతో నిండిపోయిన కౌసల్య, రాముడిని చూసి, " బుడుతడా ! నీవు కడుపున బడకయున్న / నే సుఖంపడియుందు నోయీ కుమార ! / కష్టమైనను గాని సుఖాశ లేని / కష్టమైనను నిజము సుఖంబె యగును " అని అన్నది. తీవ్రమైన దుఃఖానికి లోనైన కౌసల్య, ఇంకా యీ విధంగా తలచుకొని విలపించింది.
" రామా ! సంతానం లేని స్త్రీకి, సంతానం లేదన్న దొక్కటే బాధ. కానీ సంతానవతియైన స్త్రీకి, చక్కని నీ వంటి బిడ్డ, మన్మథుని వంటి అందగాడు, ముల్లోకాలను ఏలగలిగిన రాజు వంటివాడు, మంత్రికి ఉండవలసిన బుద్ధి విశేషాలున్న కుమారుడుండి, వాడు దూరమౌతుంటే, అది అనంతమైన దుఃఖాన్ని కలిగిస్తుంది నాయనా ! "
ఈ పద్యం కౌసల్య మాతృహృదయంతో పాటు, నవమన్మథాకారుడు, సద్గుణాల ప్రోవు, సర్వజనానురంజకుడవ గలిగిన రాజు, బుద్ధిసూక్ష్మతను పుణికిపుచ్చుకొన్న రాముడిని పట్టిచూపుతున్నది.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనిది.
No comments:
Post a Comment