ణోత్తరముల యందు నొదిగియున్న
నీలినీడలొప్పు నింగివోలిక నల్వు
రన్నదమ్ములాడు నవనితోచు.
తానో ' లాములు ' తండ్రి పేరెవరయా ' దాచాతమాలాలు ' ' నౌ
లే నా పే ' రన ' నమ్మగాల ' నగ నోలిందల్లి కౌసల్య తం
డ్రీ ' నాగా ననబోయి రాక కనులన్ నీర్వెట్టఁ ' గౌసల్య నౌ
గానే కానులె యమ్మనే ' యని ప్రభున్ గౌసల్య ముద్దాడెడిన్.
బాలురైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆరుబయట సాయంత్రం పూట ఆడుకొంటున్నారు. సుర్యాస్తమయమౌతున్నది. ఇక్కడ విశ్వనాథ అద్భుతమైన వర్ణన చేశారు.
నలుగురూ ఆడుకొంటూ ఉంటే, వాళ్ళాడుకొంటున్న నేల, తూర్పుపడమరలు దక్షిణోత్తర దిశలలో ఒదిగిపోయిన ఆకాశంలాగా ఉందట.
సూర్యుడస్తమించటం, చంద్రుడుదయించటం ఒక్కసారిగా జరిగేది పున్నమినాడు. అప్పుడు తూర్పుపడమర దిక్కుల వైపు ఎఱ్ఱగానూ, దక్షిణోత్తర దిశాముఖాలు, నీలినీడలతో నిండి ఉన్నట్లు కనిపిస్తాయి. అరుణవర్ణంతో కూడిన ఆ రెండు దిక్కులు, నీలవర్ణచ్ఛాయలతో కూడిన యీ రెండు దిక్కులలో ఒదిగిపోయి ఎఱుపు, నీలి రంగుల శోభతో ఆకాశం శోభాయమానంగా ఉంటుంది.
రామభరతులు నీలవర్ణదేహులు. లక్ష్మణశత్రుఘ్నులు అరుణవర్ణదేహులు. అందరూ కలిసిఆడుకొంటుంటే, ఆకాశంలోని ఆ వర్ణసమ్మిళిత శోభ భూమికి దిగివచ్చిందా అన్నట్లుంది. ఎంత చక్కని ఊహ ! ఎంతటి ఉదాత్త కల్పన !
ఇక రెండవ పద్యం ముద్దు మాటలు పలికే రాముడిని గురించి చెప్పిన పద్యం.
కౌసల్య రాముడిని " నాన్నా! నీ పేరేంటో చెప్పు? " అని అడిగితే రాముడు " లాములు " అని బుంగమూతి పెట్టుకొని చెబుతాడు. మరి ' మీ నాన్నగారి పేరో? ' ' దాచాత మాలాలు ' అని, ' సరేలే గాని, నా పేరు చెప్పు " అని అడిగితే " అమ్మగాలు " అని అనగానే, " కౌసల్య నాన్నా ! " అని అనబోయి, " కాదులే, అమ్మగాలే " అంటూ రాముడిపై ముద్దుల వర్షం కురిపిస్తుంది.
ఈ పద్యం పాఠకులకు ఒక్కసారిగా తల్లి ప్రేమను గుర్తు చేసి, బాల్యంలో వారి ముద్దుమురిపాల వైపుకు తీసుకువెళ్తుంది. వచ్చీరాని మాటలతో ముద్దులు మూటగట్టే పసిపిల్లవాడి మనస్సుకి అచ్చ తెలుగుదనాన్ని జోడించి, దానిని ఛందోబద్ధం చేసి, రాముని పసి(మి)తనాన్ని, తల్లి కౌసల్య మిసిమితనాన్ని కళ్ళెదుట సాక్షాత్కరింపజేసిన విశ్వనాథ శిల్పచాతుర్యానికి మరొక్కసారి ముగ్ధులవక తప్పదు.
పసిమి = బంగారు రంగు (స్వచ్ఛమైన, అమాయకపు)
మినిమి = వెన్న (మెత్తని)
ఈ రెండు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనివి.
No comments:
Post a Comment