వ్రాతము విచ్చికోనయిన వచ్చును వచ్చినఁ దుక్కులౌ శరా
ఘాతజముల్ వ్రణంబులవి కాయమునింతటఁ దేలికిచ్చునా?
చేతమునందు సంశయము చీలదు చీలును మందుమాకులన్.
వారలలో సుషేణుఁ డనువాఁడు మఱిన్ ఘనవైఁద్యుడంట తా
నేరిచియుండు నోషధులనేకములుగ్ర వనీ నివాసమై
యారయనెంత గాయముల నార్పు నిమేషములోనఁ గొన్ని సం
ధ్యారుణ కాంతులన్ గగన మందెఱుపుల్ విఱుగంగఁ జొచ్చెడున్.
రావణుని మనస్సుని రాముడిని గూర్చి ఆలోచనలు తొలిచివేస్తున్నాయి. అతడు కేవలం మానవుడా? లేక మానవుడి రూపంలో తనను సం హరించటానికి వచ్చిన శ్రీ మహావిష్ణువా? అన్నది తెగకుండా ఉన్నది. ఇంద్రజిత్తంటివాడు ప్రయోగించిన నాగపాశాలను మానవమాత్రుడైతే ఎలా విడిపించుకో గలిగాడన్నది ప్రస్తుతం అతడిని వేధిస్తున్న ప్రశ్న.
" శ్రీరాముడెంత అధ్యయనము, అభ్యాసము చేసి గారుడాస్త్రాన్ని వశంచేసుకొని నాగబంధాలను విడిపించుకో గలిగిన శాసనకర్త అయినా కూడా, ఎడతెరిపి తేకుండా వచ్చిన బాణపు గాయాలు శరీరాన్ని బాధించకుండా ఇంత తేలికనిస్తాయా? ఏమిటో మనస్సులోని అనుమానం మాత్రం వీడటం లేదు. మందులకి మాకులకి వాళ్ళ గాయాలు మాత్రం తగ్గిపోయినాయి.
వారిలో సుషేణుడనేవాడు మరీ మరీ చెప్పుకోదగిన గొప్ప వైద్యుడుట. చెట్టులూ గుట్టలూ పట్టుకు ఒకటే తిరుగుతూ ఎన్నో ఔషధ గుణాలున్న మందులని తయారుచేయటం అతడు నేర్చుకొని ఉండవచ్చు. వాడు ఎంతటి గాయాన్నైనా నిముషంలో మానిపోయేటట్లు చేస్తాడట. కొన్ని గాయాలేమో, తూరుపు సంధ్య యొక్క ఎఱ్ఱని కాంతిలో మానిపోతాయట. అదుగో ఆకాశం కూడా ఎఱుపు రంగు విరిగి తెల్లవారబోతున్నది. "
ఈ రకంగా రావణుడు ఆందోళనతో కూడిన మనస్సు కలవాడై, ఎటు తేల్చుకోలేక, మాయాయుద్ధం వల్ల ఏ మాత్రం లాభం లేదనుకొని, ఇక పరాక్రమం చూపట మొక్కటే మార్గమని, శ్రీరామచంద్రుని యొక్క ప్రచండమైన ధనుర్విద్యా నైపుణ్యాన్ని గురించి తలపోస్తున్నాడు.
మనువు మానవజీవితాలను చక్కబరచే శాసనకర్త.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.
No comments:
Post a Comment