సుల కీ రక్కసిజాతికిం జివరిరోజుల్ వచ్చె మున్నాకు ధీ
లలితుండై విధి చెప్పె నెప్పటికి గోలాంగూల మొక్కండు నీ
బలమున్ బ్రాణము లాగు సాగు దితిసూ భద్రంబు తానంతకున్.
అనుచున్ బ్రహ్మ వచించె రావణుని దౌష్ట్యం బంతమౌ కాలముం
జనుదెంచెన్ బురిలోన నే నొకతె నాజ్ఞామూర్తి లేకుండినన్
దన యే మాటయు సాగ దింక మఱి యేతాదృక్ప్రతాపోగ్రదోః
ఖని నీ వొక్కఁడు చాలు దీ యసుర పంకం బెల్ల నెండింపగన్
తమ్ముఁడెదురు తిరుగుఁ దనయాలు నిందించు
నేది చేయఁబోయి యెదురువచ్చు
పట్టుదొలఁగి నీళ్ళపై రాళ్ళు తేలును
గ్రహచయంబు చెడ్డగాఁ దిరిగిన.
హనుమంతుడు లంకిణి నెత్తి మీద ఒక్కటి మొత్తాడు. దానితో ఆ రక్కసి చేరెడు నెత్తురు కక్కుకొని, హనుమతో ఇలా అన్నది:
" ఓయీ ! ఇక ఈ రాక్షసజాతికి రోజులు దగ్గర పడ్డాయి. ఎప్పుడైతే ఒక కోతి నీ బలాన్ని, ప్రాణాలను లాగేస్తాడో, అప్పటివరకు దైత్యజాతి భద్రంగా ఉంటుంది " అని ఇంతకు ముందు బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు.
ఇక ఈ రావణుని దుర్మార్గం అంతమయ్యే రోజు లొచ్చాయి. ఈ నగరంలో నేనంటూ శాసించేదానిని ఒకతెను లేకుండా ఉంటే, రావణుని మాట ఇక ముందు సాగదు. ఇదిగో ! నీ వంటి కంటికి కనిపిస్తున్న మహపరాక్రమం ఉగ్రస్వరూపం కలగలిసిన బాహుబలసంపన్నుడు ఒక్కడు చాలు ఈ అసురజాతి అనే బురదను ఇంకింప చేయటానికి.
రావణుడి తమ్ముడు ఆయనకు ఎదురు తిరుగుతాడు. భార్య కూడా నిందిస్తుంది. రావణు డేదిచేయబోయినా అది పట్టుతప్పి ఎదురు తిరుగుతుంది. నీటి మీద రాళ్ళు తేలుతాయి. గ్రహస్థితి కలిసిరాకపోతే అట్లాగే జరుగుతుంది. "
అందరి తలరాతలు రాసేవాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు చెప్పిన మాటలనే భవిష్యవాణిగా లంకిణి చెప్పింది.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment