మసలిన భావమైన తన మాటను జేయుమనంగఁ బుత్రుడై
నస నస పోవువాడు మనినన్ మనకున్నను నొక్కడే సుమీ !
కుసులు జనించు ధర్మ మనుకొన్న పథంబొక డాశ్రయింపమిన్.
జనకు నాన నేను జవదాటగా లేను
భర్త యొకడె సతికిఁ బరమ గతియు
భూమిభర్త బ్రాణముల తోడ నుండగాఁ
దల్లి నాదువెంట దరలుటెట్లు?
నీ కన్నుల యెదుటన యి
ట్లే కాంతారమున కేగి యరుదెంచెదనే
నాకున్ ధర్మాచరణ ప్రాకట
ఫల మబ్బ నేమి ప్రతిబంధకమో !
తొలి ధర్మమ్మును చేయనెంచడును బుత్రుం డెవ్వడుం గానీ యా
తొలి ధర్మమ్మును చేయబూనుకొనగాఁ దూలింతురే! తల్లి ద
మ్ములు రాజ్యం బొక కారణంబుఁ గొని యీ పున్నెంబు వెన్ద్రోయగా
దలపన్ జూచుచుఁ జూచుచున్ మఱి మహాధర్మంబు మ్రగ్గింతునో.
రాజ్యాన్ని వదలుకొని, అరణ్యవాసానికి పోవటానికి సిద్ధమౌతున్న శ్రీరాముడిని చూసి, కన్నీటి పర్యంతమైన లక్ష్మణుడు, దీని కంతటికి మూలకారణం తండ్రి అని భావించి, ఆయనపై కోపించాడు. లక్ష్మణుని మాటలు విన్న రాముడు, తమ్మునికి ధర్మం యొక్క స్వరూపాన్ని గురించి తెలియజెప్పి, హితాన్ని ఉపదేశించాడు.
" గురువు, రాజు అయినటువంటి తండ్రి వృద్ధుడైనాడు. మరి ఆయనకు నా మీద కోపం వచ్చిందో, అనుగ్రహం కలిగిందో ! కారణ మేమైతేనేమి, నన్నొక కోరిక కోరితే, అది నెరవేర్చకుండా తప్పించుకు పోయేవాడు, బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. లక్ష్మాణా! ధర్మమార్గమని అనుకొన్న దానిని ఆచరింపకపోతే చాలా దుఃఖం కలుగుతుంది సుమా !
తండ్రి మాటను నేను జవదాటలేను. ఇక, అమ్మ సంగతంటావా, భార్యకు భర్త అనేవాడే సర్వస్వం. అయినా రాజు బ్రతికి ఉండగా, తల్లి నాతో వస్తాననటం న్యాయం కాదు. "
తరువాత, తల్లి కౌసల్యతో, ఈ విధంగా చెప్పాడు.
" అమ్మా ! (ఎందుకు బాధపడతావు?) ఇదిగో ! నీ కళ్ళెదుట ఉన్నవాడిని ఉన్నట్లుగా, వనవాసానికి వెళ్ళి తిరిగొస్తాను. నాకు ధర్మాచరణ చేసే గొప్ప ఫలం లభిస్తుంటే, దానిని అడ్డుకోవటం తగునా?
పితృవాక్య పరిపాలన (సత్యవాక్పరిపాలన) చేయాలని, మనోవాక్కాయ కర్మలా, అనుకోవటం ఏ కొడుక్కయినా అంత సులభం కాదు. అటువంటిది, తండ్రి మాటను పాలించే అవకాశం నాకొస్తే, దానిని చెడగొడతారేమిటి? తల్లి బాధ పడుతున్నదని, తమ్ముళ్ళను వదిలిపెట్టి పోవలసి వస్తున్నదని, రాజ్యం చేజారిపోతున్నదని, ఏదో ఒక కారణం చూపించి పుణ్యాన్ని వెనక్కి తోయాలని చూడటం, ఒక మహాధర్మాన్ని మంటగలపటం కాదా ! "
తండ్రి యీ దేహాన్నిచ్చినవాడు. దేహమనేది ఉంటేనే ధర్మాచరణ సాధ్యం. అందువలన, పితృవాక్య పరిపాలన మానవుని ప్రథమ ధర్మం.
" రామో విగ్రహవాన్ ధర్మః ". శ్రీరాముడు ధర్మాన్ని, తనకు తానుగా ఆచరించి, ఆ మార్గంలోనే మానవజీవితానికి సాఫల్యం, సార్థకత అని లోకానికి చాటిచెప్పడానికి, మానవునిగా దిగివచ్చిన అవతారమూర్తి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండం లోనివి.
No comments:
Post a Comment