జెల్లున, యగ్ని వాయు సరసీరుహసూతి ముఖాస్త్ర విద్యయుం
జెల్లున, తక్షకాది పరిషించిత వాంతవిషానలాస్త్ర వి
ద్యోల్లసనంబు తా నెటుల నుండెనొ యీతని వద్దఁ జిత్రమై.
ఎన్నో యేండ్లు భుజంగలోకమున భోగీంద్రాళి బంధుత్వమై
కన్నాఁడీ పటుశక్తి యింద్రజి తిరస్కారంబుగా శత్రురా
జిన్నిల్పోపననన్య సాధ్యముగ నీ శ్రీరాముఁ డే రీతిగాఁ
బన్నాగంబులు పన్నెనిట్లుఁ విదలింప న్నాగబంధంబులన్.
ఎన్నెన్నింటికి నెంతయెంత యగునో యీ రాఘవుం డక్కటా
మిన్నాగుం గొనితెచ్చికొంటిని సమున్మీలత్ఫణా సాధువున్
మిన్నేర్గేదఁగిరేకుగాఁ బొదువు సామిం గొల్చి యీ రీతిగా
నున్నాఁడన్ మఱి యేమికావలయు నోహో యల్ప తేజస్కులై.
శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు రామలక్ష్మణులను నాగపాశాల నుండి విముక్తులను చేశాడు. సూర్యోదయానికల్లా రామలక్ష్మణులు స్పృహ లోనికి వచ్చారు. రాముడు లేచి నిల్చొని అల్లెత్రాటిని మ్రోగించాడు. ఆ మహాధ్వనిని విన్న రావణుడు అదిరిపడ్డాడు. దానితో, రాముని గురించి రావణునిలో సంశయం మొదలయింది. అతడు తనలో తా నిట్లా అనుకొన్నాడు.
" విలువిద్యలో చెప్పలేనంత నేర్పు ఉన్నంత మాత్రాన, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, బ్రహ్మాస్త్రము మొదలైన అస్త్ర విద్య లున్నంత మాత్రాన, తక్షకుడు మొదలైన మహాసర్పముల విషాగ్నిని తట్టుకోగలిగిన, ఒళ్ళు గగుర్పొడిచేటంతటి విద్యా నైపుణ్యం రాముడి వద్ద చిత్రంగా యెట్లా ఉన్నదో !
ఇంద్రజిత్తు ఎన్నో ఏళ్ళు పాతాళలోకంలో మహాసర్పాలతో బంధుత్వాన్ని నెరిపి, ఈ అమోఘమైన శక్తిని సంపాదించాడు. దానిని తలకిందులు చేస్తూ, శత్రువులు తేరిచూడటానికి కూడా సాధ్య మవని అనన్య సామాన్యమైన రీతిలో, శ్రీరాముడు నాగబంధాలను విడిపించుకో గలిగినంతటి పథకాలను ఎలా పన్నగలిగాడు?
వీటన్నింటినీ సాధించాడంటే రాముడు ఎంతటి వాడో? నేను మిన్నాగుని తెచ్చి ప్రక్కన పెట్టుకొన్నాను. ఆకాశగంగను మొగలిరేకుగా ధరించిన స్వామిని కొలిచిన నేను యీ విధంగా మిగిలిపోయాను. మరి అల్పమైన పరాక్రమం కలిగి ఉంటే, ఏమవుతుందో, ఏమిటో? "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోని యీ పద్యాలలో రావణుని మనసుని తొలుస్తున్న అనుమానాన్ని తెలియజేస్తున్నది. రావణుని మనస్సుని, ఈ రాముడు, యుగాల నుండి తనతో శత్రుత్వమున్న శ్రీ మహావిష్ణువా లేక సామాన్య మానవుడా అన్న సంశయం కలచివేస్తున్నది. శ్రీ మహావిష్ణు వన్న అనుమానం కలిగిన ప్రతిసారి, ఏదో ఒక సంఘటన ఆధారంతో, దానిని నిద్ర పుచ్చుతూ వస్తున్నాడు. కానీ, రాముడు అవతారపురుషు డన్న అనుమానం బలపడుతుండటంతో, రావణుడు సంశయ నిస్సంశయాల మధ్య నలిగిపోయాడు. ఈ విధమైన రావణుని మానసిక సంఘర్షణ శ్రీమద్రామాయణ కల్పవృక్షాంతర్గత రావణుని పాత్రను శిల్ప దృష్ట్యా మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళింది.
No comments:
Post a Comment