అరరే నమ్మఁగనేరనయ్యెదనుసూ, అస్మత్సుతుండింద్రజి
త్తురగ క్రూరశరప్రబంధకలిత వ్యూహంబు నిర్మింప స
త్వరుఁడై దానిని విప్పికోఁగలిగెనే వారాశివీచీదృశా !
నీవేమందు వనంగను,
మీ వైఖరి మీకె తెలియును మీరున్ మీరున్
రావణుఁడును రాముడు మా
కా విషయము తెలియదనిన నబ్జాక్షి నగన్.
నీ కిష్టమ్మిది కానియట్టెఱుగుదున్ నీరేజపత్రేక్షణా !
నీ కిష్టమ్మిట నెట్లుగాఁ గలుగునే నీరేజపత్రేక్షణా
నాకున్ రాముడు వార్థిదాఁటె ననినంతన్ గుండెలో బర్వుగాఁ
జేకొంటైనది భార మెక్కువగ దోచెన్ దీనితో నంగనా !
రామలక్ష్మణులు నాగపాశ బంధాలనుండి విముక్తులయ్యారు. రావణునిలో సంశయం మొదలయింది. మల్లగుల్లాలు పడుతున్నాడు. నిద్ర పట్టడం లేదు. పట్టమహిషి మండోదరి దగ్గరకు వచ్చి, తన గోడు చెప్పుకొంటున్నాడు.
" పద్మపురేకుల వంటి కన్నులు గలిగిన మండోదరీ ! సముద్రానికి వారధి కట్టినవాడు మానవమాత్రు డంటావా? అరరే ! నమ్మ శక్యం కాకుండా ఉందే ! మన కుమారుడు ఇంద్రజిత్తు పన్నినటువంటి, క్రూరమైన బాణాలతో నిర్మింపబడిన నాగపాశాలను సత్వరమే విడిపించుకోగలిగాడు. ఇదంతా చూస్తే నీ కేమనిపిస్తుంది? " అని మండోదరిని అడిగాడు.
దానికి మండోదరి, " మీరు చేసే పనులు మీకే తెలియాలి. ఒకరేమో రావణుడు, ఇంకొకరు రాముడు. అందువలన ఆ విషయాలు మీకే తెలియాలి. " అని నవ్వింది.
మండోదరి మాటలు విన్న రావణుడు, ఆమెతో ఈ విధంగా అన్నాడు.
" నేను చేసిన పని నీకు ఇష్టం కాదని నాకు తెలుసు. నేను చేసిన పని నీకు ఇష్టంగా ఎందుకుంటుంది? రాముడు సముద్రం దాటాడనగానే నాకు గుండెలో పెద్ద బరువు పెట్టినట్లయింది. ఇప్పుడు నాగపాశాలను విడిపించుకోవటంతో, అది ఇంకా ఎక్కువయినట్లుగా అనిపిస్తున్నది. "
రావణుడు మండోదరిని " వారాశివీచీదృశా ! " అని సంబోధించాడు. అంటే, సముద్ర తరంగములపై దృష్టి సారించినదానా ! " అని అర్థం. సముద్రము అతి విశాలమైనది, లోతైనది, గంభీరమైనది. మండోదరి కూడా అటువంటిదే. మహాపతివ్రత. పంచకన్యలలో ఒకరిగా పేరుగాంచినది. వివేచనా శక్తి గలిగిన స్త్రీ. తన భర్త, సీతను లంకకు తీసుకురావటం అనర్థదాయకమని, లంకకు చేటని ఆమెకు తెలుసు.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, కుంభకర్ణ ఖండము లోనివి.
No comments:
Post a Comment