శ్రీనాథుల్ కవితాసతీ కుచతటీ శ్రీ గంధ కస్తూరికా
స్థానంబున్ బొనరించి రిప్పటికి నస్మత్ స్తోత్ర పాత్రంబవై
దేనెల్ ద్రావిన నోటికిన్ జలము లందింపయ్యె విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని నూటొకటో, చివరిదైన పద్యం. ఈ పద్యాలలో కొన్ని దీర్ఘ సంస్కృత సమాసావృతమై, నా వంటి వాడు అన్వయం చేసుకొని, అర్థం చేసుకొనడానికి కష్టమైనా, తప్పొప్పులన్నీ పరమేశ్వరుని సంకల్పాలే ననే భావనతో, నాకు స్ఫురించిన అర్థాన్ని వ్రాశాను. కొన్ని పద్యాలకు అర్థం నాకే సంతృప్తికరంగా లేవు. నాకు, పాఠకులకు, ఆ పరమేశ్వరుడే సరైన అర్థాన్ని సరైన సమయంలో తెలియజేస్తాడనే పరిపూర్ణమైన భక్తిభావనతో, ఈ పద్యానికి అర్థాన్ని మీ ముందుచుతున్నాను.
" విశ్వేశ్వరా ! నీవు ఆనందమే సంపూర్ణంగా నిండి ఉన్నవాడివి. నీ మహానుభావుతను ధూర్జటి, శ్రీనాథుడు మొదలుగా గల మహాకవులు, పరిమళభరితములైన మంచి గంధము, కస్తూరి లేపనములతో కవితాసతికి అర్చన చేశారు. ఇప్పుడు నీవు నా పాలిన పడ్డావు. ఆ మహాకవులు తియ్యనైన తేనెను నీ నోటి కందిస్తే, నేను మంచినీళ్ళతో సరిపెడుతున్నాను. "
సంగీతసాహిత్యాలు సరస్వతీదేవి స్తనద్వయాలు.
పరమేశ్వరుడు అష్టైశ్వర్యప్రదాత. అణిమ, మహిమ,గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనేవి అష్టైశ్వర్యాలు.
ధూర్జటి మహాకవి కృష్ణదేవరాయలవారిచే " స్తుతమతియైన ఆంధ్రకవి " అని మెప్పు పొందినవాడు. శివభక్తిపూరకములైన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకం వ్రాసినవాడు. కవిసార్వభౌముడు, ఈశ్వరార్చనకళాశీలుడు, అయిన శ్రీనాథుడు కాశీఖండము, హరవిలాసము, భీమఖండము వంటి మహోత్కృష్టమైన శివభక్తి కావ్యాలను తెలుగుజాతి కందించారు.
ఈ పద్యం ' అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి ' అయిన విశ్వనాథవారి వినమ్రతకు మచ్చుతునక. అంతటి గాఢప్రతిభునికి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కడ తల ఎత్తుకోవాలో, భక్తిపూర్వక వినమ్రతతో ఎక్కడ తలదించుకోవాలో తెలుసు. విశ్వనాథునికి మధుధారల వంటి కవిత్వ మందించి, ' జలము లందింపయ్యె ' అని నిగర్వంగా చెప్పుకొన్న ఋషిత్వం ఒక్క విశ్వనాథకే చెల్లింది.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీన్ మహీశాన్
గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం
లోకా స్సమస్తాన్ సుఖినో భావంతు.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
No comments:
Post a Comment