ఱెప్పలు మూసికొన్నఁ బ్రసరింపవు లోని వెలుంగు లే గతిం
జొప్పడు నింద ఱంగనల సోలుపులందున వేలుపున్ సతుల్
చొప్పడియుండ భూమిసుత శుద్ధమహాత్మ వెలుం గెఱుంగఁగన్.
మఱియును నీళ్ళు చల్లినను మానవకాంతల పంచభూత మం
థర తను చర్మముల్ తడియు నాకపురీ వనితాంగ చర్మముల్
విరవిరవోవు నీ దృశ వివేకముచేఁ దాగు భేదభావ మి
ద్దరి తనుచర్మపుంబొరల తన్కునఁ బోల్పగవచ్చుఁ గొంతగా.
వాల్మీకి రామాయణంలోని సుందర కాండము చాలా విశిష్టమైనది. ఆ కాండములోని విశిష్టతకు కారణం, సీతాన్వేషణ సమయంలో బహిర్గతమైన హనుమ బాహుపరాక్రమంతో పాటు, అతడు వెలయించిన బుద్ధివిశేషాలలో ఉంది. కార్యదీక్షాపరుడైనవాడు, నిత్యజాగరూకుడై, ఏ విధంగా కార్యసాఫల్యాన్ని పొందాలో, మానవజాతికి చూపిన మహోత్కృష్టమైన కాండమిది. అందువలననే, ఇది పారాయణయోగ్యమే కాదు, సర్వమానవాళికి ఆచరణయోగ్యమైనది.
హనుమ, లంకా నగరంలోని ప్రతి ఇంటినీ శోధిస్తున్నాడు. అతడికి రావణుని పుష్పకవిమానం కనపడింది. దానిలో ఎందరో స్త్రీలు నిద్రావివశులై ఉన్నారు. వారిని చూసి, హనుమ, అమ్మవారిని ఏ విధంగా గుర్తుపట్టాలా అని పలువిధాల తలపోస్తున్నాడు.
" ఎవరైనా ఒప్పారినట్లుగా కళ్ళు తెరిచి ఉంటే, వారి ఆత్మ యొక్క వెలుగు బయటకు కనపడుతుంది. అదే, రెప్పలు మూసికొని ఉంటే, లోపలి వెలుగు ఏ విధంగా కూడా బయటకు ప్రసరించదు. ఈ పుష్పకంలో ఇంతమంది నిద్రావివశత్వంలో ఉండగా, అందులో దేవతా స్త్రీలు కూడా ఉండగా, మహాశుద్ధాత్మ అయిన భూజాని సీతను గుర్తుపట్టడం ఎలా?
అయితే, ఒంటి మీద నీళ్ళు జల్లితే, పంచభూతాత్మకమైన మానవకాంతల దేహాలు తడుస్తాయి. అదే దేవకాంతల దేహాలు విర విర పోతాయి. ఈ మాత్రం వివేకం చేత, వారి వారి శరీరాల్లో కల భేదాన్ని, వారి చర్మపు పొరలలోని కాంతి వల్ల కొంత తెలుసుకోవచ్చు. "
హనుమ ప్రదర్శించిన యీ వివేచనాదృష్టి కార్యసాధకునికి చాలా అవసరం. పనిని సాధించుకోవాలనుకొనేవాడు తొందర పడకూడదు. నిదానంగా, వస్తుపరిశీలన చేసి, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని, రంగం లోకి దిగాలి.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.
No comments:
Post a Comment