బునఁ దచ్చౌర్యము శైవభక్తియు మనంబును ముట్టి మెచ్చించు నీ
తని పేర్విన్న హృదంతరంబున విచిత్రమైన యాకర్షణం
బును దీపించెడుఁ దత్స్వభావము మనంబున్ దాఁటు నూహింపగా
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా కాండము, గజపుష్పి ఖండము లోనిది.
వాలి భార్య తార రాజనీతి, మంత్రాగం తెలిసిన స్త్రీ. దూరాలోచన కలిగినది. రామలక్ష్మణులనే అన్నదమ్ముల అండ సుగ్రీవునికి లభించిందని ఆమె విన్నది. రాముని అండతో, సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలవటం వెనుక పొంచియున్న అపాయాన్ని గ్రహించి, వాలిని యుద్ధానికి వెళ్ళకుండా చేసే ప్రయత్నమే ఈ పద్యంలోని భావం. తార వాలిని వారిస్తూ చెప్పిన మాట లివి.
" ఇంతకు ముందు భార్గవరాముడిని గురించి విన్నాము. విన్నటువంటి రాముని పేరులో, ఆ పరాక్రమము, శివుని యెడల భక్తి మనసు లోపలికి చొచ్చుకుపోయి మెప్పిస్తుంది. ఇక ఈ రాముని పేరు విన్నంతనే, గుండె లోపలి పొరల్లో ఏదో తెలియని ఆకర్షణ ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఆ ఆకర్షణ గురించి , స్వభావం గురించి ఊహిస్తే, మనస్సు యొక్క పరిధిని దాటిపోతుంది. "
శివుని అనుగ్రహంతో పరశువు అనే అస్త్రాన్ని పొందాడు కనుక పరశురాముడని, భృగువంశానికి చెందినవాడు కనుక భార్గరాముడని పేరు వచ్చింది. భార్గవరాముడు పరమ మాహేశ్వరుడు. సీతాకళ్యాణ సమయంలో, శివధనుర్భగం చేసినందుకు పరశురాముడు కోపించగా, దశరథుని పుత్రుడైన కళ్యాణరాముడు అతడి లోని తెజాన్ని తనలో లీనం చేసుకొన్నాడు. శ్రీరాముడే శ్రీ మహావిష్ణువని గ్రహించి, భార్గవరాముడు మహేంద్రగిరికి తపస్సు చేసుకొనడానికి వెళ్ళిపోయాడు. ఇదే విచిత్రమైన ఆకర్షణను తార తన విచక్షణా జ్ఞానంతో గ్రహించగలిగింది.
No comments:
Post a Comment