యాకు వెన్నీనె తీసి కొసాకు పెద్ద
చెఱువునంతటి యాకు వేసి జల మింత
చఱచి వండిన వాతాపి యెఱచి బెట్టె.
ముని ముద్దముద్దకును త్రేఁ
చును జేతం గుక్షి రాచుచున్ జీర్ణ మ్మం
చను నమలి నమలి మ్రింగును
కనుచుండిన యిల్వలునకుఁ గడువెఱఁగొదవన్.
ఎంత కామరూపు లేని వింధ్యాచల
మంత పెరుఁగ లేరురా ! దురాత్మ !
కడు నగస్త్యదండి గర్భంబునన్ జీర్ణ
మైన తమ్ముఁడెట్టు లరుగుదెంచు.
నా విని కుంభసంభవుని నామముచే హృది దిగ్గురంచు దుః
ఖావిలచేతుఁ డిల్వలుఁడు నాగ్రహవృత్తి నగస్త్యమౌనిపైఁ
బోవ ఘటోద్భవుండు కనుమూసి సమాధిని బొందినంత దే
వావలివైరి కీకసచయంబులతో మసిబొగ్గుగాఁగనై.
అరణ్యమార్గంలో వస్తున్న మునిని ఆపి, ఆతిథ్య మిస్తానని చెప్పి, ఇల్వలుడు అతడిని ఇంటికి తీసుకువచ్చాడు. ముని అనుష్ఠానం అయిపోగానే, అతడిని కూర్చోబెట్టి, వెన్ను ఈనె తీసినటువంటి పెద్ద చెరువంత అరటి ఆకు అతని ముందు వేసి, దాని మీద నీళ్ళు జల్లి, వండినటువంటి వాతాపి మాంసాన్ని వడ్డించాడు.
ముని ముద్ద ముద్దకూ త్రేనుస్తూ, చేతితో పొట్ట రాసుకుంటూ, " జీర్ణం జీర్ణం " అంటూ బాగా నమిలి మ్రింగసాగాడు. ఎదురుగా ఉండి చూస్తున్న ఇల్వలుడికి దడ పుట్టసాగింది. "
ఇల్వలుడు వాతాపిని, బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని బయటకు రమ్మన్నాడు. అప్పుడు ముని ఇల్వలుడితో ఇలా అన్నాడు:
" ఓరీ దురాత్మ ! మీరెంత కామరూపులైనా కూడా వింధ్య పర్వత మంత ఎత్తు పెరుగలేరురా. అగస్త్యుడి పెద్ద పొట్టలో జీర్ణమైపోయిన నీ తమ్ముడు డెట్లా తిరిగి వస్తాడురా?
అగస్తుడనే పేరు వినపడగానే, ఇల్వలుడి గుండె జారిపోయి, దుఃఖవివశుడై, కోపంతో ఊగిపోతూ, అగస్త్య మహర్షి పైకి పోయాడు. అగస్త్యుడు కళ్ళు మూసుకొని సమాధి స్థితిని పొందగానే, ఇల్వలుడు ఎముకలతో సహా మసిబొగ్గుగా మారిపోయాడు. "
సముద్రాన్నే ఔపోసన పట్టిన మునికి పెద్ద చెరువంత అరటి ఆకు కూడా చాలదు. కానీ వచ్చినవాడు, పరమ మాహేశ్వరుడు, పరమ వైష్ణవుడైన, అగస్త్యుడని ఇల్వలుడికి తెలియదు పాపం.
సప్తర్షులలో అగ్రగణ్యుడైన అగస్త్యుని మహత్తును తెలిపే యీ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment